హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా ఎదుగుతున్న గ్రేటర్ హైదరాబాద్లో జనాభా కంటే వాహనాల సంఖ్యే అధికంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం హైదరాబాద్లో 60 లక్షల జనాభా ఉంటే.. గత నెల 27 నాటికి 71.58 లక్షల రిజిస్టర్డ్ వాహనాలున్నాయి. వీటిలో దాదాపు 70 శాతం ద్విచక్రవాహనాలే. కార్లు 18-19 శాతమే. కరోనా వల్ల గత మూడేండ్ల నుంచి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రజా రవాణా వ్యవస్థల కంటే వ్యక్తిగత వాహనాలకు నగరవాసులు అధిక ప్రాధాన్యమిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణకు, కొత్త రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది. ఫలితంగా నగర వైశాల్యంలో రహదారుల విస్తీర్ణ శాతం పరంగా హైదరాబాద్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.