హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఓలా, ఉబర్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆటోరిక్షాలపై కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి 5% వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూలు చేయనున్నది. ఇలాంటి ఆటోలకు గతంలో జీఎస్టీ నుంచి ఇచ్చిన మినహాయింపును ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం నవంబర్ 18న విడుదల చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కాకుండా ఆఫ్లైన్/మాన్యువల్ పద్ధతిలో ఆటోలు నడిపేవారికి మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది. ఈ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల సంఘాలు మండిపడుతున్నాయి. జీఎస్టీ విధింపు ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా కష్టాల్లో కూరుకుపోయిన ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడొద్దని తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో కేంద్రాన్ని హెచ్చరించారు. కొవిడ్ సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్లు తమ వాహనాలను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం గతేడాది మోటర్ వాహన పన్నును రద్దు చేయడాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఆటో డ్రైవర్లకు బాసటగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం వారి ఉపాధికి తూట్లు పొడుస్తున్నదని ధ్వజమెత్తారు. ఆటోలపై జీఎస్టీ విధిస్తే ఆ భారం ప్రజలపై పడే అవకాశమున్నదని తెలిపారు. దీనిపై త్వరలో వాహన సంఘాలన్నీ సమావేశమై కేంద్రంపై ఐక్య పోరాటానికి దిగనున్నట్టు వెల్లడించారు. జీఎస్టీ విధింపు యోచనను విరమించుకొనేలా కేంద్రంపై ఓలా, ఉబర్ సంస్థలు ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.