హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా త్రిగుళ్ల గ్రామ వాస్తవ్యుడు బ్రహ్మశ్రీ త్రిగుళ్ల ప్రభాకర్శర్మ (84) మృతి చెందారు. హృద్రోగ సంబంధ వ్యాధికి హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఉపాధ్యాయ వృత్తిలో వందలాది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ప్రభాకర్శర్మ సనాతన వైదిక కార్యక్రమాల్లోనూ నిష్ణాతులు. తన తండ్రి బ్రహ్మశ్రీ రాజమౌళిశర్మ వద్ద సనాతన వైదిక ప్రతిష్ఠ కార్యక్రమాలను అభ్యసించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో వందకుపైగా ప్రతిష్ఠాపనలు నిర్వహించి ధర్మవ్యాప్తికి దోహదపడ్డారు. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి ఉత్తరాల ద్వారా వచ్చే అనేక ధర్మ సందేహాలకు తన అనుభవంతో ఉచితమైన, శాస్త్ర ఆధారమైన సలహాలు ఇచ్చేవారు. పరంపరగా వస్తున్న గురుసేవలో భాగంగా మర్కూక్ పాండురంగ ఆశ్రమంలో జరిగే అన్ని విశేష కార్యక్రమాల్లోనూ సేవలందించారు. శర్మకు భార్య, కూతురు, నలుగురు కుమారులు ఉన్నారు. గురువారం త్రిగుళ్లలో ప్రభాకర్శర్మ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.