హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్రం వీబీ-జీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడంపై మంత్రి సీతక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసిందని, మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి కొప్పుల రాజుతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అదానీ, అంబానీ మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకు ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేశారని ఆరోపించారు.
ఉపాధిహామీ పథకాన్ని కాపాడాలని గ్రామాల్లో తీర్మానాలు చేసి.. కేంద్రానికి పంపిస్తామని స్పష్టంచేశారు. జీ-రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా 27 లేదా 28 తేదీల్లో కొత్త సర్పంచులు, వార్డు సభ్యులతో గ్రామాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
నాలుగేండ్ల కష్టంతో రూపొందించిన చట్టాన్ని నాలుగు గంటల చర్చ కూడా లేకుండా జీ-రామ్-జీ చట్టంగా తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఏఐసీసీ కార్యదర్శి కొప్పుల రాజు అన్నారు. గతంతో ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచామనే కేంద్రం ప్రకటన బో గస్ అని పేరొన్నారు.