హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తి రంగంలో అపార అనుభమున్న సింగరేణి సంస్థ సౌర విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే మొదటి దశ సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పి విజయవంతంగా నడిస్తున్నది. మొదటి దశ సక్సెస్ కావడంతో రెండో దశ ఎనిమిది చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.1348 కోట్లతో మొత్తం 323 మెగావాట్ల ప్లాంట్లకు జాతీయస్థాయి టెండర్లను పిలిచింది. టెండర్ల దాఖలుకు ఈ నెల 25వ తేదీ ఆఖరుగా పేర్కొన్నది. టెండర్లు పిలిచిన నేపథ్యంలో సింగరేణి సీఎండీ శ్రీధర్ బుధవారం సింగరేణి భవన్లో విద్యుత్తు విభాగ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణరావు రెండోదశ సోలార్ ప్లాంట్ల ని ర్మాణానికి సంబంధించిన 8 ప్రాంతాలు, ప్లాం ట్ల సామర్థ్యాలు, నిర్మాణానికి గుర్తించిన భూ ముల వివరాలను వివరించారు. మందమర్రిలో 240 ఎకరాల్లో 67.5 మెగావాట్లు, రా మగుండం మూడు ఏరియాల్లోని ఓవర్ బర్డెన్ డంపులు, ఖాళీ భూములు మొత్తం 166 ఎకరాల్లో 37 మెగావాట్లు, శ్రీరాంపూర్ ఏరియా లో 96 ఎకరాల్లో 27.5 మెగావాట్లు, కొత్తగూడెంలో 130 ఎకరాల్లో 32.5 మెగావాట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ప్రాంగణంలో 130 ఎకరాల్లో 37.5 మెగావాట్లు, ఇల్లందు ఏరియాలో 55 ఎకరాల్లో 15 మెగావాట్లు, భూపాలపల్లిలో 45 ఎకరాల్లో 10 మె గావాట్లు, రామగుండం-1 ఏరియాలో 13 ఎ కరాల్లో 5 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చే యడానికి నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే మరో ఏడాదిలో సింగరేణి మొత్తం 530 మెగావాట్ల ద్వారా 700 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, ఇది సంస్థ వినియోగిస్తున్న మొత్తం విద్యుత్తుకు సమానమవుతుందని, తద్వారా దేశంలో నెట్ జీరో కర్బన ఉద్గారాల కోల్ కంపెనీగా సింగరేణి చరిత్ర సృష్టిస్తుందని సీఎండీ శ్రీధర్ తెలిపారు. పర్యావరణహితకారిగానే కాకుండా ఏడాదికి 500 కోట్ల వరకు ఆదా చేసినట్టు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి థర్మల్ విద్యుత్తు కేం ద్రం పనితీరును సమీక్షించారు.ఆగస్టులో ప్లాం ట్లోని రెండు యూనిట్ల ద్వారా 100% ఉత్పత్తికి సిద్ధంగా ఉండటం.. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 97.1% నమోదవ్వడంపై సీఎండీ హర్షం ప్రకటించారు. ఇదే ఒరవడితో ముందుకు సాగాలని, దేశంలోనే నెం.1 ప్లాంట్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సమీక్షలో సీటీసీ సంజయ్‌కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జేఎన్ సింగ్, ఎస్టీపీపీ జీఎం చినబసివిరెడ్డి, జీఎం జానకీరామ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎస్వీకేవీ రాజు, జీఎం సూర్యనారాయణ, ఏజీఎం ప్రసాద్, సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
మొదటి దశ ప్లాంట్లతో లాభాలు
పర్యావరణ హిత చర్యల్లో భాగంగా సీఎం డీ శ్రీధర్ ప్రత్యేక చొరవతో సింగరేణి చరిత్రలో మొదటిసారిగా 300 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి 2020లో శ్రీకా రం చుట్టింది. వీటిలో 224 మెగావాట్ల ప్లాంట్ల నుంచి 731 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో కంపెనీకి రూ. 515 కోట్లు ఆదా అయ్యాయి. సింగరేణి యేటా గనులు, కాలనీల అవసరాలకు సుమారు 700 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నది. దీనికోసం కంపెనీ సుమారు రూ.490 కోట్లను తెలంగాణ డిస్కమ్‌లకు చెల్లిస్తున్నది. అయితే, సింగరేణి మొదటి దశలో ఏర్పాటు చేసిన 224 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ద్వారా ఏడాది కాలంలో 342 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. దీనిని గ్రిడ్‌కు అనుసంధానం చేయడంతో సంస్థకు ఏడాదిలో రూ.240 కోట్ల ఆదా అయ్యింది. దీనితో సింగరేణి యాజమాన్యం ఇంకా ఖాళీగా ఉన్న స్థలాల్లో మరో 232 మెగావాట్ల సామర్థ్యంతో రెండో దశ ప్లాంట్లను నిర్మించాలని ప్రణాళిక వేసింది. ఈ విషయంలో సీఎండీ చొరవ చూపించారు. జూలై 14న జరిగిన బోర్డు సమావేశంలో రెండో దశ ప్లాంట్ల నిర్మాణం కోసం రూ.1348 కోట్ల అంచనాలకు బోర్డు ఆమోదం తెలిపింది.