వరంగల్, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కార్మికుల సంక్షేమ పథకాలపై ఎక్కువ మందికి అవగాహన కలిగించేలా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మే నెలంతా కార్మికులతో కలిసిపోయేలా విభిన్నంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. నిరుడు ‘కార్మిక చైతన్య మాసోత్సవం’ పేరుతో నెలపాటు వివిధ కా ర్యక్రమాలు నిర్వహించారు.
ఈ ఏడాది మే నెలంతా ‘కార్మిక సంక్షేమ మాసోత్సవం’ పేరుతో కార్యక్రమా ల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ రంగాల్లో కొత్తగా చేరిన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇప్పించడం, వారి పేరుతో బీమా చేయించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని కార్మికులకు వర్తింపజేయడంలాంటి కార్యక్రమాలను ఈ నెలలో నిర్వహిస్తారు. కార్మికుల సంక్షేమంపై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను ముఖ్యంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎక్కువ మంది కార్మికులు ఉండే నగర, పట్టణ సెగ్మెంట్లలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని పలువురు ఎమ్మెల్యేలను కేటీఆర్ ఆదేశించారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మండలిని ఏర్పాటు చేసిం ది. భారీగా నిధులు కేటాయించింది. ఆటోలకు రూ.77.30 కోట్ల ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. గుమస్తాలకు కనీస వేతనం చట్టం అమలు చేస్తున్నది. హామాలీలకు పని భద్రత కల్పించింది. భవన నిర్మాణ కార్మికులకు లక్ష ద్విచక్ర వాహనాలు అందజేసేలా నిర్ణయం తీసుకొన్నది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వీటి స్థానంలో నాలుగు కోడ్లను తీసుకొచ్చింది. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ స్టీల్వంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నది. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాలను కార్మిక సంక్షేమ మాసోత్సవంలోఎండగడుతున్నారు.