హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది. రెండేండ్లుగా ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ విభాగం (ఓఅండ్ఎం) పరిశీలిస్తున్నది. 2021-22, 2022-23కు సంబంధించి రూ.254 కోట్ల అంచనా వ్యయంతో 1,565 పనులను మంజూరు చేసింది. ఇప్పటికే 770 పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మిగతా 795 పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతున్నది.
ఓఅండ్ఎం కమిటీ 2023-24 సంవత్సరంలో రూ.48.53 కోట్లతో దాదాపు 66 పనులను చేపట్టాలని నిర్ణయించింది. మూసీ ప్రాజెక్ట్ ఎడమ గట్టు, సోలిపేట్ (వీ), సూర్యాపేటలో నాన్-ఓవర్ ఫ్లో సెక్షన్ మరమ్మతులకు రూ.76.10 లక్షలు మంజూరు చేసింది. కాకతీయ కెనాల్ డిస్ట్రిబ్యూటరీలపై క్రాస్ రెగ్యులేటర్లు/ఓటీల మరమ్మతులకు రూ.184.90 లక్షలు, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి 77.658 కిలోమీటర్ వద్ద 21వ మేజర్ ఆఫ్ టేక్ స్లూయిస్‌కు అత్యవసర మరమ్మతులకు రూ.64.75 లక్షలు, ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువపై 39.140వ కిలోమీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ మెకానికల్ భాగాల మరమ్మతులకు రూ.65.10 లక్షలు మంజూరు చేసింది. త్వరలోనే ఆయా పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు ఓఅండ్ఎం కసరత్తు చేస్తున్నది. ఎస్సారెస్పీ ఎర్త్‌డ్యామ్ ఆఫ్ స్ట్రీమ్ రివిట్మెంట్ మరమ్మతులకు రూ.15. 67 కోట్లు, కోయిల్‌సాగర్ నాగిరెడ్డిపల్లి పంపింగ్ స్టేషన్, టీలైర్లోని స్టేజ్-2 పంపింగ్ స్టేషన్ పనులను మూడేండ్లలో విడతలవారీగా చేపట్టేందుకు రూ.14.74 కోట్లు, ఎస్సారెస్పీ వరద కాలువపై వేంపల్లి సమీపంలో 3.325 కిలోమీటర్ వద్ద సూపర్ పాసేజ్ మరమ్మతులకు రూ.12.9 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
ప్రాజెక్టుల మరమ్మతు పనులను వర్షాకాలం ప్రారంభానికి ముందు జూన్‌లోగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) ఈఎన్సీ నాగేందర్రావు ఆదేశించారు. ప్రాజెక్టులు, కాలువలు, తూముల మరమ్మతు పనులను వారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తిచేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరమ్మతులను రూ.75 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది. తొలుత రూ.17 కోట్లతో స్పిల్ వే మరమ్మతు పనులను చేపట్టింది. ప్రాజెక్టు కట్టిన సమయంలో అమర్చిన రెండు లిఫ్ట్‌ల స్థానంలో కొత్త లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఒక లిఫ్ట్‌ను అమర్చింది. ప్రాజెక్టు ఎడమవైపున ఉన్న 9 గేట్లను పూర్తిగా మార్చాలని నిర్ణయించగా, వాటిలో 3 గేట్లను ఇప్పటికే మార్చింది. గేట్ల రోప్‌లను కూడా మార్చడంతో పాటు అవసరమైన చోట కొత్త రబ్బర్ సీళ్లను కూడా మార్చుతున్నది. మట్టికట్టపై చెత్త, మొక్కలను తొలగించే పనులనూ చేపట్టింది.