Srisailam | శ్రీశైలం : శ్రీశైలం ఆలయంలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం శ్రావణ అయిదవ శుక్రవారమైన ఈ రోజు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. గత శ్రావణ మూడవ శుక్రవారం రోజున కూడా ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించబడ్డాయి. ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణమండపంలో ఈ వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రోజు జరిపించబడిన ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు చెంచు గిరిజన భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలోని పలు చెంచుగూడాలకు చెందిన 650 మంది చెంచు భక్తులు ఈ వ్రతాన్ని జరిపించుకున్నారు. అదేవిధంగా దాదాపు 950 పైగా ఇతరులు కూడా ఈ వ్రతాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సామూహిక వ్రతనిర్వహణలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రమణమ్మ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాసరావు, పలువురు పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. వెంకట శివప్రసాద్, ఐటీడీఏ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ కేపీ నాయక్, పలువురు సిబ్బంది కూడా ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. కాగా ఈ సామూహిక ఉచిత వ్రతాలలో మొత్తం 1600 మందికిపైగా భక్తులు వరలక్ష్మీ వ్రతాన్ని జరిపించుకున్నారు. కాగా నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలలోని దాదాపు 90 గూడెముల నుంచి సుమారు 650 మంది చెంచు భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
వ్రతాలకు కావాల్సిన పూజాద్రవ్యాలనన్నంటినీ దేవస్థానమే సమకూర్చింది. వ్రతకార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ముత్తైదువల కోసం వేరు వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా ఈ వ్రతం జరిపించబడింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వ్రతంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహించబడింది. తరువాత వేదికపై వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడ్డాయి.
అనంతరం వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవివారిని సమంత్రకంగా ఆవాహన చేయడం జరిగింది. తరువాత శ్రీసూక్తవిధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవివారికి షోడశోపచారపూజలు జరిపించబడ్డాయి. అనంతరం ఆలయ అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేయబడింది.
వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ, చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వృక్షప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు, పుస్తక ప్రసాదంగా శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందజేయబడ్డాయి. వ్రతానంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్లదర్శనం కల్పించబడింది. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనం నందు భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ.. మన వైదిక సంప్రదాయంలో శ్రావణ మాసాన వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ శ్రావణమాసం సర్వదేవతా ప్రీతికరంగా చెప్పబడుతోందన్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మీవ్రతాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో గిరిజన చెంచు సోదరీమణులకు అవకాశం కల్పించామన్నారు. చెంచు ముత్తైదువులను ఎంపిక చేయడంలో ఐటీడీఏ అధికారులు, వారి సిబ్బంది ఎంతగానో సహకరించారన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ అధికారులకు ధన్యవాదములు తెలియజేశారు.
కాగా చెంచుల సంస్కృతి సంప్రదాయాలలో శ్రీశైలమహాక్షేత్రానికి ఎంతో ప్రత్యేకస్థానం ఉందన్నారు. గిరిజన చెంచులు మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిగా, భ్రమరాంబాదేవి అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారన్నారు.
ఈ సామూహిక వ్రత కార్యక్రమములో అధికసంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారు మహాశక్తి స్వరూపిణి శ్రీభ్రమరాంబాదేవివారు స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీశైలమహాక్షేత్రంలో వరలక్ష్మీవ్రతాన్ని జరిపించుకునే వారందరు కూడా ఎంతో అదృష్టవంతులన్నారు. అందరికీ శ్రేయస్సు కలుగుతుందన్నారు.
శ్రీశైలమహాక్షేత్రంలో చేసే ఏ పుణ్యకార్యమైన వెయ్యింతల ఫలితాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నారు.
అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. వెంకట శివప్రసాద్ వారు మట్లాడుతూ.. దేవస్థానం గిరిజన చెంచు భక్తులను వ్రతాలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం పట్ల దేవస్థానానికి ధన్యవాదాలు తెలియజేశారు. మూడు జిల్లాలలోని పలుగూడెముల నుండి గిరిజన చెంచు భక్తులు ఈ వ్రతానికి తొడ్కొని రావడం జరిగిందన్నారు. కాగా భక్తులందరూ వ్రతక్రియను సౌకర్యవంతంగా వీక్షించేందుకు వీలుగా చంద్రవతి కల్యాణమండపంలో ఎల్.ఈ.డి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.