మెదక్ : రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.
పోలీసులు దౌర్జన్యంగా రైతులను అరెస్టు చేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు గన్నీ బస్తాలు, లారీలు లేకపోవడంతో వడ్లు కల్లాల్లోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు దౌర్జన్యంగా ధర్నా చేయకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.