గజ్వేల్, అక్టోబర్ 3: మూసీ(Musi river) ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జేబుల్లో ఖజానా నింపుకోవడానికే భారీగా బడ్జెట్‌ను పెంచిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి(Vanteru Pratap Reddy) ఆరోపించారు. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో ఖాజానాను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు ముందుకు తెచ్చిందన్నారు. మంత్రి కొండా సురేఖ సభ్య సమాజం తలదించుకునేలా మహిళ అన్న విషయాన్ని మరిచి సినీనటి సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేవారని విమర్శించారు.
మహిళా మంత్రి సురేఖకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదని, సమంతపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పది నెలల కాలంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.90వేల కోట్ల అప్పు చేసిందని, కానీ.. రాష్ట్రంలో ఎలాంటి కొత్త పథకాలను ప్రారంభించలేదన్నారు. ప్రభుత్వం గాలిలో నడుస్తుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదాయం పెంచుతామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆదాయం పెంచడం ఏమో కాని ఆదాయాన్ని మాత్రం దించుతున్నడన్నారు.
త్వరలోనే రుణమాఫీపై రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ పర్యటనలో భాగంగా మైనంపల్లి హన్మంతరావు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై పెట్రోల్ పోసి తగలబెడతాని మాట్లాడడంపై వంటేరు ప్రతాప్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హన్మంతరావుపై గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.