గజ్వేల్, జూలై 16: గజ్వేల్ నియోజకవర్గ రైతులకు సాగు నీటిని అందించకుండా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగా చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలను తరలించి ఇక్కడి రైతుల పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. కూడవెళ్లి, హల్దీ వాగుల్లోకి సాగు నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా కొడకండ్ల సమీపంలో కొండపోచమ్మ కాలువ వద్ద రైతులతో కలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్నేపల్లి మోటర్లను ఆన్ చేసి ప్రాజెక్టులు నింపి సాగుకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఒక్క రోజు కూడా కరువును చూడలేదని అన్నారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతులు వర్షాల కోసం నిరీక్షించే కాలం వచ్చిందని తెలిపారు. వర్షాలు కురవక నాట్లు వేసుకోలేని దుస్థితి నెలకొన్నదని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగుకు అందించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరు వస్తుందోననే రేవంత్ నీటిని వదలడం లేదని దుయ్యబట్టారు.