ముషీరాబాద్, ఏప్రిల్ 20: అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అణగదొక్కుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాదిగలకు కనీసం రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేస్తే సీఎం రేవంత్రెడ్డి కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు డాక్టర్ మల్లేశ్, శ్రీనివాస్, గణేశ్, రమేశ్, వరలక్ష్మి, వేణు, శ్రీనివాస్, వెంకట్, నందకిశోర్ పాల్గొన్నారు.