బోడుప్పల్, నవంబర్28 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకే తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని బొమ్మక్బాలయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మేయర్ సామల బుజ్జిరెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడుతూ… ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఇటీవల మనువాద రాజకీయ పార్టీలతో చేసుకొంటున్న ఒప్పందాలు, అనుసరిస్తున్న విధానాలపై పూర్తిగా విభేదిస్తున్నట్టు చెప్పారు.
బీజేపి ట్రాప్‌లో పడి ఎమ్మార్పీఎస్ జెండాను పక్కకు పెట్టిన మంద కృష్ణను తెలంగాణ ప్రజలు విశ్వసించడంలేదని అన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్‌తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని స్పష్టంచేశారు. ప్రస్తుతం బీజేపీ నేతలు వర్గీకరణ పేరుతో ఎస్సీల ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దళితబంధు’ తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. బీఆర్ఎస్కు మద్దతు ఇస్తూనే మాదిగ, ఉపకులాల హక్కులకోసం పోరాడుతానని శ్రీనివాస్ స్పష్టంచేశారు.