ముషీరాబాద్, జనవరి 18 : ఎస్సీ వర్గీకరణకు అడ్డంకిగా ఉన్న మనువాద పార్టీలతో మాదిగలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయం అంటే.. సమాన పంపిణీ అని, కచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాల్సిందేనని స్పష్టంచేశారు. విద్యానగర్లోని సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమిషన్లు అన్నీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పటికీ అమలు ఎందుకు నోచుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
మాదిగ, ఉపకులాల, దళత వ్యతిరేక మనువాద పార్టీలు వర్గీకరణకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 30 ఏండ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మనువాద పార్టీలు మద్దతు పలికి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కోరారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణ జరగకపోతే ఆ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు మాదిగలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు బంగారు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్యామ్రావు, ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ చందు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్, యూనివర్సిటీల ఇన్చార్జి జన్నారపు జీవన్, ఓయూ అధ్యక్షుడు ఎల్ నాగరాజు, హైదరాబాద్ అధ్యక్షుడు కానుగంటి సురేశ్, నాయకులు మణి, ఫణి, శ్రీనివాస్ పాల్గొన్నారు.