ముషీరాబాద్, ఫిబ్రవరి 12: వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. అమరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు, రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ విద్యానగర్లో బుధవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలను ఆదుకున్నట్టుగానే వర్గీకరణ ఉద్యమంలో మృతిచెందిన అమరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అమరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణకు బాటపడిందని చెప్పారు.
దండోరా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాడ్ చేశారు. రాజధానిలో అమరుల స్మారక విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక స్థలం కేటాయించాలని కోరారు. కేసీఆర్ హయాంలో 14 కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంతవరకూ ఎవరూ పరామర్శించనేలేదని తెలిపారు. మార్చి 1న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పొట్టపెంజర రమేశ్, కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, పడిశాల వెంకన్న, నాగరాజు, శ్యామ్రావు, శ్రీకాంత్, సురేశ్ తదితరులు పాల్లొన్నారు.