హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): వరంగల్ కాజీపేటలో కేంద్రం ఏర్పాటు చేయనున్న కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్ల బోగీలు తయారు చేసేలా రైల్వే బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఒకటి రెండు నెలల్లో దీనిపై రైల్వే బోర్డు అధికారిక ఆదేశాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్ల చైర్కార్తోపాటు స్లీపర్కోచ్ల తయారీని అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు తాత్కాలిక పనులు కూడా కొనసాగుతున్నాయని ఎస్సీఆర్ సీపీఆర్వో శ్రీధర్ పేర్కొన్నారు. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అప్పటి కేసీఆర్ సర్కారు కృషి ఫలితమేనని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేంద్రంతో పలుసార్లు సంప్రదింపులు జరపడం వల్లనే ఫ్యాక్టరీ సాకారమైందని గుర్తుచేస్తున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం బడ్జెట్లో రూ.521 కోట్లు ప్రతిపాదించింది.