హైదరాబాద్, జూన్ 19 (నమస్తేతెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల భారీ ప్రాజెక్టు ఆ రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారుతుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విమర్శించారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81, 900 కోట్లని, భవిష్యత్తులో రూ.2 లక్షల కోట్లకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను మరింత అప్పుల పాలు చేయొద్దని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం, వెలుగొండ, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా అన్నమయ్య, జరికోన, పింఛ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులు గత 30 ఏండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. వాటి ని పూర్తి చేయకుండా మరో భారీ ప్రాజెక్టును ప్రతిపాదించడం రాష్ర్టానికే మంచిది కాదని హితవు పలికారు. కేవ లం కమిషన్ల కోసమే బనకచర్ల ప్రాజెక్టును నిర్మించవద్దని హెచ్చరించారు.