హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): డెడికేటెడ్ కమిషన్ నివేదికను గోప్యంగా ప్రభుత్వానికి అందించడంపై బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు వెలువరించిన అంశాలను పరిష్కరించిన తర్వాతే కమిషన్ నివేదికను తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ దానిని నిలబెట్టుకోకపోవడమంటే బీసీలను నమ్మించి నట్టేట ముంచడమేనని పేర్కొన్నారు. కులగణనలో బీసీల జనాభా తగ్గించారని మరోసారి స్పష్టం చేశారని విమర్శించారు.
కులాలవారీగా వివరాలన్నీ బహిర్గతం చేయాలనే డిమాండ్‌ను సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి పరిష్కరిస్తామన్న మంత్రి హామీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి ప్రత్యేక సమావేశం ఎందుకు నిర్వహించారని మండిపడ్డారు. నాటి సమావేశంలో తిరిగి కుల సర్వే చేస్తామని చెప్పగా, ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా కమిషన్ నివేదిక తెప్పించుకోవడం బీసీలకు ద్రోహం చేయడమేనని పేర్కొన్నారు.