హైదరాబాద్: ఉద్యమ సారధి కేసీఆర్ దార్శనికతతోనే తెలంగాణ (Telangana) అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు (Vakulabharanam Krishna mohan rao) అన్నారు. కులవృత్తిదారులకు (Traditional Occupations) రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పారు. ఇలాంటి పథకాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) ధన్యవాదాలు తెలిపారు. పదేండ్లలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. సబ్బండ వర్గాలకు సంక్షేమం అందిస్తున్న సీఎం కేసీఆర్ అని చెప్పారు.
సంక్షేమ సంబురాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. మంచిర్యాల వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బీసీల్లోని కులవృత్తుల్లో ఉన్నవారికి, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం రూపొందించింది. ఇటీవలే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనున్నది. ఇది నిరంతర ప్రక్రియ కాగా, అర్హులను ఎంపిక చేసి ప్రతి నెలా 15న లబ్ధిదారులకు చెక్కులను అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. పథకం గ్రౌండింగ్‌లో ఆయా కులవృత్తులకు దోహదపడే పనిముట్లు, పరికరాలు కొనుకోవటానికి లబ్ధిదారులకు సహకరించటంతోపాటు రెండేండ్ల వరకూ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నది.
వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి బీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.300 కోట్లను ప్రతిపాదించింది. మొదటి విడతగా రూ.100 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం బీసీ కులవృత్తిదారులకు, చేతివృత్తిదారులకు ఆర్థికసాయం అందించాలని నిర్ణయంచిన నేపథ్యంలో అందుకు సంబంధించి నిధులను కూడా విడుదల చేసింది.