హైదరాబాద్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ): బీసీలకు రిజర్వేషన్ల కల్పనతోనే సామాజిక న్యాయం వెల్లివిరుస్తుందని పరితపించి, సాధికారికంగా సిఫారసులు చేసిన బీపీ మండల్ బీసీలకు మార్గదర్శకుడని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అభివర్ణించారు. బీసీ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో కాచిగూడలోని ఒక ప్రముఖ హోటల్లో శుక్రవారం నిర్వహించిన బీపీ మండల్ 105వ జయంతి సభకు వకుళాభరణం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల్ కమిషన్ అధ్యయనం చేస్తున్న అప్పటి రాజకీయ అనిశ్చితి, సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అనేక సవాళ్లను అధిగమిస్తూ బీపీ మండల్ కఠోర పరిశ్రమ చేసి నివేదికను సమర్పించిన ధీశాలి అని శ్లాఘించారు. వేదిక కన్వీనర్ డాక్టర్ చంద్రకుమార్ సభాధ్యక్షత వహించగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, సామాజికవేత్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు డాక్టర్ ప్రసన్నకుమార్, డాక్టర్ భాగయ్య, చంద్రపాల్బాబా, ఎన్ శ్రీనివాస్, కే రఘుపతి, వీరయ్య, మల్లేశం, దుర్గేశ్, శంకర్ పాల్గొని మాట్లాడారు. బీసీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కిశోర్‌గౌడ్ పూల మాలవేసి నివాళులార్పించారు.
బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి, వారి వాటా వాళ్లకే దకాలని సిఫార్సు చేసిన ఆధునిక బీసీల యుగకర్త బీపీ మండల్ అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు. హైదరాబాద్‌లోని బీసీ దళ్ కేంద్ర కార్యాలయంలో బీపీ మండల్ జయంతి సందర్భంగా మండల్ చిత్రపటానికి నివాళులర్పించారు.