హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తమ రాష్ట్ర వివరాలను అందజేయాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. దేశంలో తొలిసారిగా 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం కులగణన నిర్వహించిందని తెలిపారు. దేశంలో 52శాతం మాత్రమే బీసీలున్నారని 2015లో ప్రకటించిన కేంద్రం.. ఆ నివేదికలో తప్పులు దొర్లాయంటూ దానిని బహిర్గతం చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చిందని తెలిపారు.
గతంలో కేంద్రం విజ్ఞప్తి మేరకు కొన్ని రాష్ర్టాలు తమ నివేదికలోని తప్పులను సరిదిద్ది కేంద్రానికి నివేదించాయని గుర్తుచేశారు. తెలంగాణ విషయంలో మాత్రం ఎలాంటి తప్పులు దొర్లినట్టు కేంద్రం ధ్రువీకరించలేదని పేర్కొన్నారు. మళ్లీ కులగణన చేపట్టే ఉద్దేశం లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆనాటి నివేదిక వివరాలను తమకు అందించాలని కోరారు. ఇప్పటికే సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల శాతాన్ని స్థిరీకరించుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందని గుర్తుచేశారు. కులగణన వివరాలను అందిస్తే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా నిర్ణయించుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.