హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో(Thousand Pillar Temple) వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు. మహానివేదన నీరాజనా మంత్రపుష్పాల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఏడాదికి 24 ఏకాదశలు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందువచ్చే పుష్పశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారని, విష్ణు ప్రీతికరమైన ఏకాదశిలలో ఇది అత్యంత ప్రాధాన్యమైనదన్నారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణలను, సీతారామచంద్రస్వామివార్లను, వెంకటేశ్వ రస్వామివాళ్లను దర్శించడం వలన మోక్షం కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయని దానికి అనుకూలంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవం నిర్వర్తించడం జరిగిందన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ, ప్రణవ్, శ్రవణ్, కాశి లింగాచారి, వేద పండితులు గంగు మణికంఠశర్మ అవధాని పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్ భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భక్తులు ‘శ్రీరామ రామ రామేతి రమేరమే మనోరమే’ అంటూ రామనామా జపం చేశారు.