Vahan Sarathi Portal | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఒకే తరహా ఆర్సీ, డీఎల్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహన్ సారథి’ పోర్టల్ సేవలను రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చేందుకు ‘గ్రహాలు’ అనుకూలించడం లేదు. ప్రభుత్వ ‘పెద్దల’కు తీరిక లేకపోవడంతో ఆ పోర్టల్ ప్రారంభోత్సవానికి ‘ముహూర్తం’ కుదరడం లేదు. ‘వాహన్ సారథి’ పోర్టల్ అమలు కోసం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం (పైలట్ ప్రాజెక్టు) నిరుడు డిసెంబర్లోనే ముగిసింది. దీంతో ఆ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘వాహన్ సారథి’ సేవలను ప్రారంభించేందుకు రవాణా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ఆ సేవలను ప్రారంభించేందుకు రవాణా శాఖ మంత్రి ఈ గత 3 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఆ మంత్రిని సంప్రదించగా.. సీఎం రేవంత్‌రెడ్డితో ప్రారంభోత్సవం చేయిద్దామని చెప్పినట్టు తెలిసింది.
దీంతో మంత్రి అపాయింట్మెంట్ దొరకడమే గగనమైపోతే ఇక సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి ఈ పోర్టల్‌ను ప్రారంభించడం ఇప్పట్లో జరిగేదేనా? అని అధికారులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నెల 9 నుంచే రాష్ట్రవ్యాప్తంగా ‘వాహన్ సారథి’ సేవలను అందుబాటులోకి తెస్తామని, తదనుగుణంగా ఆ పోర్టల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రకారంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఇంకా ఆ సేవలు ప్రారంభం కాలేదు. దీంతో విసిగిపోయిన అధికారులు.. కనీసం రవాణా శాఖ మంత్రివర్యులైనా ‘వాహన్ సారథి’ పోర్టల్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్‌లో మళ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ పోర్టల్ సేవలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
రోడ్డు విస్తరణలో భాగంగా తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం తొలగింపునకు గత నెలలో ఆదేశాలు జారీ కావడంతో అధికారులు 2 నెలల్లోగా ఆ కార్యాలయాన్ని కూల్చివేయనున్నారు. ఇప్పటికే తిరుమలగిరి మార్గంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ‘వాహన్ సారథి’ పోర్టల్ ప్రారంభోత్సవానికి ముందే తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం కూల్చివేత జరుగుతుందోనేమోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.