హైదరాబాద్ జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ‘ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సహించలేక డిప్యూటీ స్పీకర్ పదవిని త్యజించి.. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. తెలంగాణను సాధించి నాలుగుకోట్ల ప్రజల దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉద్ఘాటించారు. మహాత్ముడు చూపిన అహింసామార్గంలో ఆయన రాష్ర్టాన్ని సాధించిపెట్టారని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. ప్రజల మద్దతుతో అధికారం చేపట్టి పదేండ్లలో ఎనలేని అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టించారని పేర్కొన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా జీవించారని తెలిపారు.
సర్వ హంగులతో సెక్రటేరియట్‌ను నిర్మించి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ పేరు పెట్టారని ప్రశంసించారు. మహానగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. నేర నియంత్రణకు అధునాతన టెక్నాలజీతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారని, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ బ్రిడ్జీలు కట్టించిన గొప్ప పాలనాదక్షుడు కేసీఆర్ అని కొనియాడారు. సుస్థిరమైన పాలన, పటిష్ఠమైన శాంతిభద్రతలు, సరళమైన పారిశ్రామిక విధానాలతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివచ్చాయని తెలిపారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఉబర్, ఇన్ఫోసిస్ లాంటి ఎన్నో బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని పేర్కొన్నారు. పాలనా సౌలభ్యం కోసం 23 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి సకల హంగులతో కలెక్టరేట్ భవనాలను నిర్మించారని, వైద్య, నర్సింగ్ కళాశాలలను స్థాపించారని గుర్తుచేశారు.
బృహత్తరమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేండ్లలోనే నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగ్విజయంగా నిర్మించారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ఏటా సుమారు 2.45 కోట్ల ఎకరాలకు నీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేసి అన్నపూర్ణగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన విద్యనందించేందుకు 1,104 గురుకులాలను నిర్మించారని, విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ.20 లక్షల చొప్పున అందజేసిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, గీత, నేత, బీడీ కార్మికులకు రూ.2016 చొప్పున, దివ్యాంగలకు రూ.4016 చొప్పున ఆసరా పింఛన్లు ఇచ్చి అసహాయులను ఆదుకున్నారని తెలిపారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లిండ్లకు రూ.లక్ష చొప్పున సాయం చేశారని తెలిపారు. మాతాశిశు సంరక్షణకు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, పోషకాహార కిట్లు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఆయన పాలనలోనే తెలంగాణలో సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలోనే పార్లమెంట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టారని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆనాడు తానే తొలి ఓటు వేశానని ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర సాధన కోసం ఆనాడు జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.