మాదాపూర్, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్రంలోని కాపులు, మున్నూరుకాపులు ఐక్యంగా ముందుకు సాగాలని, సమిష్టిగానే హక్కులను సాధించుకోవాలని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. హైదరాబాద్ మియాపూర్‌లోని సత్యభారతి కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన కాపు, మున్నూరుకాపు ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.5,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికోసం ఐక్యవేదికను ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
స్వాతంత్య్రానంతర కాలం లో దేశాన్ని, రాష్ర్టాన్ని ఎక్కువకాలం ఏలిన కాంగ్రెస్, బీజేపీల బీసీలకు తీరని అన్యాయం చేశాయని విమర్శించారు. ఇన్నేండ్లలో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరమని తెలిపారు. బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో మున్నూరుకాపుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు. దానిలో భాగంగానే బీసీ జాబితాలో మున్నూరుకాపులను తక్కువ చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కులగణనలో మున్నూరుకాపులకు జరిగిన అన్యాయంపై సమిష్టిగా పోరాడాలని, మార్చి నెలాఖరులో హైదరాబాదులో ఆత్మగౌరవసభను నిర్వహించాలని, కాపులకు, మున్నూరుకాపులకు రాజకీయ, సామాజికపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగినా సమైక్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరుతూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, ప్రతినిధులు ముత్యాల రామదాస్, లక్ష్మీకాంతం, విఠల్, తెలంగాణ విఠల్, బండి పద్మ, మహేందర్‌కుమార్ పటేల్, బాపట్ల మురళి, దాదె వెంకట్, మీసాల చంద్రయ్య, అరవ రామకృష్ణ, మరికలపోతు సుధీర్, సమ్మెట ప్రసాద్, బాలా శ్రీనివాస పటేల్, నేతిమంగమ్మ తదితరులు పాల్గొన్నారు.