హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో బీసీల ఓట్లు అడుగుతారు కానీ.. రాజ్యాధికారంలో సముచిత స్థానం ఎందుకు కల్పించడం లేదంటూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. దేశ జనాభాలో 60శాతానికి పైగా ఓబీసీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
గురువారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఓబీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఏస్ అధికారి చిరంజీవులు ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాకు శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, సీనియర్‌నేతలు బడుగుల లింగయ్య యాదవ్, బీద మస్తాన్‌రావు, పురుషోత్తమరావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, కులగణన చేయాలని చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో బీసీలకు సముచిత ప్రాధాన్యత లభించిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీలు ఇద్దరే ఉన్నారని, త్వరలో భర్తీ కానున్న 6 స్థానాలలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికారంలో ఓబీసీలకు న్యాయమైన వాటా దకేంత వరకు బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా గొంతెత్తి నినదిస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు సిద్ధేశ్వర్, కిరణ్, వేల్పుల శ్రీనివాస్, పర్వతం సతీశ్, అరుణ, చామకూరి రాజు, డీ వేలాద్రి, కేవీ గౌడ్, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.