హైదరాబాద్, జనవరి 3 /బంజారాహిల్స్: ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 15- 18 ఏండ్లలోపు పిల్లలందరికీ టీకాలు వేయించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. తామంతా వ్యాక్సిన్ వేసుకొన్నామని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని గుర్తుచేశారు. టీకా వేసుకొంటేనే రక్షణ కవచం మాదిరిగా పనిచేస్తుందని స్పష్టంచేశారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంత్రి ప్రారంభించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 15- 18 ఏండ్ల మధ్యవారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18.41 లక్షల మంది ఉన్నారని, వీరికి 1,014 ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా టీకాలు వేస్తున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ సహా 13 మున్సిపల్ కార్పొరేషన్లలో కొవిన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు వేసుకోవాలని సూచించారు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అదనపు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవసరమైతే వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచుతామని, కాలనీలకు వెళ్లి టీకాలు వేయిస్తామని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లేలా చర్యలు తీసుకొంటామని వివరించారు. ప్రభుత్వం ఉచితంగా కొవాగ్జిన్ టీకా వేస్తున్నదని, నాలుగు వారాల తర్వాత రెండో డోస్ ఇస్తామని చెప్పారు.
10 నుంచి ప్రికాషన్ డోస్
దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని, గత వారం రోజుల్లోనే పాజిటివిటీ రేటు నాలుగు రెట్లు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో హెల్త్‌వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లు, 60 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ వేయాలని, ఇతర దేశాల్లో మాదిరిగా 15 ఏండ్లు పైబడినవారికి టీకాలు వేయాలని పలుమార్లు రాష్ట్రం తరఫున కేంద్రాన్ని కోరామని చెప్పారు. చివరికి కేంద్రం ఇటీవలే ఒప్పుకొన్నదని తెలిపారు. హెల్త్‌వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లు, 60 ఏండ్లు పైబడి కోమార్బిడిటీస్ ఉన్నవారికి ప్రికాషన్ డోస్ (మూడో డోస్) ఈ నెల 10వ తేదీ నుంచి వేస్తామని స్పష్టంచేశారు. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో.. తెలంగాణతోపాటు 100% మొదటి డోస్ వేసిన రాష్ర్టాలను అభినందించారని చెప్పారు. తొలి రెండు వేవ్‌లలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది సమర్థంగా పనిచేశారని అభినందించారు. మూడో వేవ్ వస్తే ఇబ్బంది లేకుండా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని వసతులు కల్పించామని, 21 లక్షల హోం ఐసొలేషన్ కిట్లు తయారు చేయించామని, ఔషధాలు నిల్వ చేశామని వివరించారు. ఎలాంటి లక్షణాలు ఉన్నా ప్రభుత్వ దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, డీపీహెచ్ శ్రీనివాసరావు, కలెక్టర్ శర్మన్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ర్యాగింగ్ ఘటనపై చర్యలు
సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై కమిటీ ఏర్పాటు చేసి, వెంటనే నివేదిక ఇవ్వాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించినట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటామని స్పష్టంచేశారు. సూర్యాపేటలోని మెడికల్ కళాశాలలో ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ జరుగుతుందని ఫస్టియర్ విద్యార్థి సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ రాజేందప్రసాద్ మెడికల్ కళాశాలకు వెళ్లి విద్యార్థులను, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకొన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని గుర్తించి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.