హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపట్టిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చెయ్యకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ఆదేశాలతో తమిళనాడులో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎలా కల్పించారో తెలుసుకునేందుకు అక్కడ పర్యటించామని, అక్కడి అనుభవాలు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవినపెడుతున్నదని మండిపడ్డారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రైవేశపెట్టిన తరువాత సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీ వెళ్లినప్పటికీ, ఈ బిల్లు పై అక్కడి పెద్దలతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రిజర్వేషన్ల విషయం లో తమ మనసు గాయపడినట్టయితే, ఆ తర్వాత జరిగే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
జీవో ఇవ్వకముందే కోర్టుకెళ్లారు: శ్రీనివాస్‌గౌడ్
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొనిరావడంలో సీఎం రేవంత్ విఫలమయ్యారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఈ అంశంపై సర్కార్ జీవో ఇవ్వకముందే కొందరు కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభు త్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీసీ బిల్లు పై బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదన్నారు.
మాట తప్పితే తీవ్ర పరిణామాలు: గంగుల
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా, 42% రిజర్వేషన్ల పేరుతో జీవో తెచ్చి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తు న్న పాలకులు గత 22 నెలల్లో ఆ జీవో ఎందు కు విడుదల చేయలేదని మాజీ మంత్రి గంగు ల కమలాకర్ ప్రశ్నించారు. జీవో ఇవ్వకుండానే, కొందరు కోర్టుకు వెళ్లడం కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. బీసీ రిజర్వరేషన్లపై మాట తప్పితే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ సర్కార్‌ను హెచ్చరించారు.
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తారు: జోగు
బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్.. అదే బీసీల పట్ల చులకన భావంతో ఉన్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాకు రాహుల్‌గాంధీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనేలేదని, అందుకే జీవో అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ను బీసీలే భూ స్థాపితం చేస్తారని హెచ్చరించారు.
బీసీలే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు: ముఠా గోపాల్
బీసీలంతా ఏకమయ్యే సమ యం వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెబుతారని ముషీరాబాద్ ఎమ్మె ల్యే ముఠాగోపాల్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటే.. 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీల్లో ఐక్యత లేదని, వాళ్లేం ముందుకొస్తారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీలు ఎప్పటికీ మరిచిపోరని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.