హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పు వద్దే వద్దని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తేల్చిచెప్పారు. సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధిత రైతుల పక్షానా తెగించి కొట్లాడుతామని హెచ్చరించారు. గురువారం తెలంగాణ భవన్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని కౌరుపెల్లి, జంగారెడ్డిపల్లి, వెంకట్రాజంపేట, రాంపూర్, అన్నబోయినపల్లికి చెందిన ట్రిపుల్ఆర్, గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని మాట్లాడారు. భూమిని నమ్ముకున్న రైతులను కాంగ్రెస్ సర్కారు నట్టేటా ముంచుతున్నదని ధ్వజమెత్తారు. ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చి, 1700 మంది చిన్న, సన్నకారు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని తెలిపారు. అలైన్మెంట్ మార్పు గురించి తెలియదంటున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయీంగ్యాంగ్ను పెంచిపోషిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గ్యాంగ్‌లోని వాళ్లను అడ్డంపెట్టుకొని రైతుల భూములను గుంజుకొని అడ్డాకూలీలుగా మార్చే కుట్ర చేస్తున్నారని.. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ రైతులను నిండా ముంచుతున్నరని నిప్పు లుచెరిగారు.
తెలంగాణ భవన్‌ను జనతాగ్యారేజీలా భావించి తరలివచ్చిన ట్రిపుల్ఆర్ బాధిత రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రోడ్ల గుంతలు కూడా పూడ్చడం చేతగాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్రిపుల్ఆర్ రైతులను ఇబ్బంది పెట్డడం బాధాకరమని విమర్శించారు. అన్నదాతలు సంఘటితంగా ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపు నిచ్చారు. సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.
ట్రిపుల్ఆర్ బాధిత రైతులందరూ సంఘటితంగా ఉండాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉద్బోధించారు. బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని ఉద్ఘాటించారు.