హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సిట్ విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో బొగ్గు కుంభకోణం, మంత్రుల పంచాయితీ, ప్రభుత్వ మనుగడ వంటి అంశాలను డైవర్ట్ చేయడానికే కేటీఆర్, హరీశ్‌రావుపై సిట్ విచారణలు చేపట్టిందని దుయ్యబట్టారు. చట్టాలు, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని, విచారణలకు, అరెస్టులకు భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రులు బ్రోకర్ దందా, సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లు కట్టాలన్నా, భూముల పంచాయితీ తెంపాలన్నా, మంత్రులకు పర్సెంటేజీలు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. ఇలాంటి వాటి నుంచి బయట పడటానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో ఆ పార్టీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.