Lift Irrigation Projects | గత రెండు వ్యాసాల్లో ప్రస్తావించిన అంశాలనే మే 1న ఆంధ్రజ్యోతిలో అచ్చయిన మూడో వ్యాసంలోనూ వెదిరె శ్రీరాం ప్రస్తావించారు. ఆ వ్యాసం చదివిన తర్వాత ఎన్డీఎస్ఏ నివేదికను కూడా తెలుగులో మకీకిమకీ అనువాదం చేయడంలో శ్రీరాం దారుణంగా విఫలమయ్యారని స్పష్టమవుతున్నది. మోదీ రాష్ట్ర పర్యటనకు ముందే తన వ్యాస పరంపరను పూర్తి చేయాలనే తొందరపాటు అందులో కనబడుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా శ్రీరాం ఇలాంటి ప్రయత్నమే చేశారు. అప్పుడు హైదరాబాద్‌లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కాళేశ్వరంపై విషం చిమ్మి పోయిండు. మోదీ వద్ద మారులు కొట్టేసేందుకు తెలంగాణ మీద విషం చిమ్మడం ఎందుకు శ్రీరాం గారూ..? సరే వెదిరె అనువాద కళను తప్పుబట్టడం అటుంచి ఆయన లేవనెత్తిన అంశాలపై దృష్టి పెడుదాం.
నివేదిక ఇప్పిస్తే బాగుండేది..
మూడో వ్యాసంలో వెదిరె శ్రీరాం ప్రస్తావించిన అంశాలేవీ కొత్తవి కావు. ఎన్డీఎస్ఏ 2023 అక్టోబర్ చివరలో హడావుడిగా జారీ చేసిన ప్రాథమిక నివేదికలో ప్రస్తావించినవే. వాటన్నింటినీ ఆంధ్రజ్యోతి సహా తెలుగు పత్రికలు శ్రీరాం కంటే బాగానే అనువాదం చేసి ప్రచురించాయి. ముఖ్యవిషయం ఏమంటే ఎన్డీఎస్ఏ హడావుడిగా ఇచ్చింది రాజకీయ నివేదిక అని నాడే విమర్శలు వెల్లువెత్తాయి.
ఎలాంటి పరిశీలన చేయకుండానే, భౌతిక పరీక్షల ఫలితాలు లేకుండానే, తెలంగాణ ఇంజినీర్లతో చర్చించకుండానే ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వాహణలోపాలు ఉండవచ్చుననే ఊహాగానాలతో కేంద్రంలోని పాలక పక్షానికి ఎన్నికల్లో లబ్ధి కలిగించేందుకు ఎన్డీఎస్ఏ తన నివేదికను వండి వార్చిందని నిపుణులు సైతం తప్పుబట్టారు.
అవన్నీ చివరికి భౌతిక పరీక్షలు జరిపి ఆ నివేదికలను తమకు అందించాలని ఉచిత సలహా పారేసి ఎన్డీఎస్ఏ నివేదికను ముగించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నదీగర్భంలో జరిగే మార్పుల కారణంగా ఆ ఘటన జరిగి ఉంటుందని ఎన్డీఎస్ఏ వారే తమ నివేదికలో పేరొనడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఓ సాంకేతిక సంస్థ చేయాల్సిన పనేనా? అని ఇంజినీర్లు సైతం నోరెళ్లబెట్టారు.
పియర్ల కుంగుబాటు దురదృష్టకరమైనదే. ప్రభుత్వం, ఇంజినీర్లు ఎవరూ అలా జరగాలని కాంక్షించరు. ఇక ఎన్డీఎస్ఏ బృందం బరాజ్ పునరుద్ధరణకు ఏవైనా చర్యలు సిఫారసు చేస్తారని ఆశించిన ప్రాజెక్టు ఇంజినీర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. రెండుసార్లు పర్యటించి పోలీసుల తరహా రహస్య విచారణ చేపట్టినప్పుడు వానకాలంలో వరదల నుంచి మేడిగడ్డ బరాజ్‌ను రక్షించేందుకు తాతాలిక చర్యలు సూచించాలని ఇంజినీర్లు, ప్రభుత్వ పెద్దలు ఎన్డీఎస్ఏను కోరినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు నెలలైనా వారి నుంచి స్పందన లేదు.
రుతుపవనాల ఆగమనానికి ఇంకా ఆరు వారాల సమయమే ఉంది. ఎన్డీఎస్ఏ రక్షణ చర్యలు సూచించేదెప్పుడు? ఇంజినీర్లు వాటిని అమలు చేసేదెప్పుడు? ఆ సంస్థ ఏర్పాటయ్యిందే దేశంలో ఉండే డ్యామ్‌లు, బరాజ్‌ల సంరక్షణ కోసం. కానీ, ఎన్డీఎస్ఏ మాత్రం అన్ని కేంద్ర సంస్థల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలను కాపాడే దిశగా పని చేస్తున్నదని ప్రాథమిక నివేదిక, ఆ తర్వాత దాని నిర్లక్ష్య వైఖరి స్పష్టం చేస్తున్నది. కాళేశ్వరంపై విషం చిమ్మే కార్యక్రమాన్ని చేపట్టే బదులు తెలంగాణ బిడ్డగా శ్రీరాం తన పరపతి, హోదాను ఉపయోగించి ఎన్డీఎస్ఏతో బరాజ్ రక్షణ చర్యలకు సంబంధించి నివేదిక రూపొందించే పనిలో ఉంటే బాగుండేది.
రాష్ర్టానికి, రైతాంగానికి మేలు జరిగేది. అవేవీ చేయకుండా గత ప్రభుత్వంపై, తెలంగాణ ఇంజినీర్లపై శ్రీరాంది బురద జల్లే ప్రయత్నమే తప్ప మరేమీ లేదు. నివేదిక ఇప్పించడంలో వెదిరె విఫలమవడమేగాక పైనుంచి విషం చిమ్మడం చూస్తుంటే ఆయన దృష్టంతా ఇచ్ఛంపల్లి బరాజ్ మీదనే ఉన్నట్లు తెలుస్తున్నది.
మేడిగడ్డ వరదల్లో కొట్టుకుపోతే తన కల సాకారానికి మార్గం సుగమమవుతుందని ఆయన భావిస్తున్నట్లు కనబడుతున్నది. గత నెలలో నదుల అనుసంధానంపై జరిగిన ఐఎల్ఆర్ ప్రాజెక్టుల టాస్‌ఫోర్స్ సమావేశం కోసం తయారు చేసిన ఎజెండా నోట్స్‌లో అంతర్లీనంగా ఆయన మనసులోని దుర్బుద్ధిని బాహాటంగా బయట పెట్టుకోవడమే ఇందుకు నిదర్శనం.
బరాజ్‌లు కూలిపోవాలనేది వెదిరె అకాంక్ష
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బరాజ్‌లను ఒకే విధమైన సాంకేతికతో నిర్మించారు కాబట్టి మేడిగడ్డకు ఏర్పడిన సమస్యలన్నీ అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలోనూ తప్పవని శ్రీరాం అభిప్రాయం. నిజానికది ఆయన ఆకాంక్ష. మేడిగడ్డలానే మిగిలిన రెండు బరాజ్‌లు కూడా కుంగిపోయి కూలిపోవాలన్నది కేంద్ర, రాష్ట్ర పాలకుల దుర్మార్గపు ఆలోచన. కానీ అది ఎన్నటికీ నెరవేరదు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ఎలాంటి కుంగుబాటు లేదనేది ప్రాజెక్టు ఇంజినీర్లకు తెలుసు.
ఇక ఆ రెండు బరాజ్‌లతో ఏర్పడిన నీటి లీకేజీలను ఎప్పటికప్పుడు కెమికల్ గ్రౌంటింగ్ ద్వారా అరికడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ బరాజ్‌లలో ఏ లీకేజీలూ లేవు. పత్రికలు, మీడియాలో ప్రచారమైనట్లు అవి బుంగలు కావు. చిన్నపాటి నీటి లీకేజీలు. పెర్మియబుల్ ఫౌండేషన్‌లో ఇలాంటి లీకేజీలు ఏర్పడడం అత్యంత సహజం. పరిమితి మించి నీటి లీకేజీ ఉన్నప్పుడు, ఆ నీటిలో మట్టి, ఇసుక కనిపిస్తే దాన్ని తప్పనిసరిగా అరికట్టాల్సిందే.
ప్రాజెక్టు ఇంజినీర్లు ఏటా తనిఖీ చేసి అలాంటి లీకేజీలుంటే అరికట్టే చర్యలు ఎప్పుడూ తీసుకుంటూ ఉంటారు. అందుకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు సురక్షితంగా ఉన్నాయి. ఇకపోతే మేడిగడ్డ బరాజ్ పైరెండింటితో పోలిస్తే భిన్నమైనది. మేడిగడ్డ వద్ద గోదావరి రివర్ హైడ్రాలిక్స్ భిన్నమైనవి. ఇకడ వరద పరిమాణం చాలా ఎకువ. మార్చ్ వరకు కూడా నదిలో ప్రవాహాలుంటాయి. దీని స్టోరేజీ కూడా ఎకువ.
2020, 21లో కరోనా లాక్డౌన్ కారణంగా ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీవారు మేడిగడ్డకు వెళ్లేందుకు వీలులేని భయంకర పరిస్థితి. వరర్లంతా తమ రాష్ర్టాలకు వెళ్లిపోయారు. ఆ స్థితిలో రెండు వానకాలాలు చిన్నపాటి నీటి లీకేజీలను బుంగలుగా మార్చాయి. 2022లో వచ్చిన వరద గోదావరి చరిత్రలోనే అతి పెద్దది. మేడిగడ్డ బరాజ్ వద్ద 28 లక్షల క్యూసెకులకు పైబడి వరద ప్రవాహం నమోదైంది.
బరాజ్ కింద సిమెంట్ బ్లాకులు అకడకడ లేచిపోయి ఉన్నందున చిన్నలీకేజీలు బుంగలుగా మారి రాఫ్ట్ కింద సొరంగం ఏర్పడేందకు దోహదం చేసింది. బ్లాక్ 7లో రాఫ్ట్ కింద ఏర్పడిన ఆ సొరంగం 2023లో వచ్చిన భారీ వరదల అనంతరం అక్టోబర్ చివరి వారంలో మూడు పిల్లర్ల కుంగుబాటుకు కారణమైందని తెలుస్తూనే ఉన్నది.
అక్టోబర్‌లో గోదావరిలో ప్రవాహాలు అధికంగా ఉన్నందున ఆ బుంగలను అన్నారం, సుందిళ్లలో గమనించినట్టు ఇకడ సాధ్యం కాలేదు. సొరంగం ఏర్పడిందన్న దానికి రుజువు ఏమిటంటే 20 వేలకు పైగా ఇసుక సంచులను అది మింగేయడమే. ఇది అనుకోకుండా జరిగిన దురదృష్టకర ఘటన. భౌతిక పరీక్షల ద్వారా నిర్ధారణ కాకుండానే దానికి కారణాలను శ్రీరాంలాంటివారు ఆపాదించడం సమంజసం కాదు.
డిజైన్ ప్రకారం కట్టలేదనేది అబద్ధం
సీడీవో జారీ చెసిన డ్రాయింగులను నిర్మాణ విభాగం సరిగా అమలు చేయలేదని శ్రీరాం వ్యాఖ్యానించడం సరికాదు. అలాంటి సమస్యనే ఉత్పన్నం కాదు. ఎందుకంటే సీడీవో డ్రాయింగుల ప్రకారమే నిర్మాణం చేపట్టాలనేది నిర్మాణ విభాగానికి ఉన్న ఉల్లంఘించలేని ఆదేశం (మ్యాన్డేటరీ ఆబ్లిగేషన్). నిర్మాణ సమయంలో క్వాలిటీ విభాగం ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు.
సీడీవో నుంచి ఇంజినీర్లు, సీఎం, సాగునీటి మంత్రి, ఈఎన్సీలు కూడా పరిశీలిస్తూ ఉంటారు. డ్రాయింగ్‌కి, నిర్మాణానికి తేడాలుంటే క్వాలిటీ ఇంజినీర్లు వెంటనే పై అధికారులకు రిపోర్ట్ చేస్తారు. వాటిని డ్రాయింగ్‌లో ఉన్న విధంగానే నిర్మించేలా చూస్తారు. నాణ్యతాప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా బరాజ్‌ల నిర్మాణం కొనసాగింది.
నాణ్యతా ప్రమాణాల తనిఖీకి సాగునీటి శాఖ ప్రతి బరాజ్ వద్ద ఈఈ ఆధ్వర్యంలో ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని నియమించింది. 24గంటలు వారు పని ప్రదేశంలో ఉండి నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు. అవన్నీ పని ప్రదేశంలో ఉండే ప్లేస్మెంట్ రిజిస్టర్లలో నమోదు కూడా చేశారు. ఆ రికార్డులన్నీ ఎన్డీఎస్ఏ బృందానికి అందించారు. అయినా డిజైన్, నిర్మాణ, క్వాలిటీ విభాగాల మధ్య సమన్వయం లేదని శ్రీరాం వ్యాఖ్యానించడం పచ్చి అబద్ధం.
ఇది బట్టకాల్చి మీద పడేయడమే. బరాజ్ స్థలం ఎంపిక నుంచి మొదలు ప్రతి స్టేజ్‌లో సీడీవో ఇంజినీర్ల ప్రమేయం ఉంటుంది. సీడీవో అధికారులు బరాజ్‌లను ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేస్తే నిర్మాణ విభాగం వారు రిజిట్ స్ట్రక్చర్‌గా నిర్మించారని మరో నిరాధారమైన ఆరోపణను ఎన్డీఎస్ఏ నివేదిక నుంచి ఎత్తుకొచ్చి శ్రీరాం ఇకడ రాస్తున్నారు. అది ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేశారా? లేక రిజిడ్ స్ట్రక్చర్‌గా డిజిన్ చేశారా? లేదా అన్నది ఇకడ సమస్యే కాదు.
పర్మియబుల్ ఫౌండేషన్‌పై బరాజ్‌ల డిజైన్స్‌కు సీబీఐపీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్), సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) జారీ చేసిన డిజైన్ మాన్యువల్స్, సర్యూలర్లను, బీఎస్ఐ జారీ చేసిన కోడ్స్‌ను తు.చ తప్పకుండా పాటించి సీడీవో అధికారులు బరాజ్‌ల డిజైన్లను రూపొందించారు. డిజైన్స్‌లో లోపం ఉందని ఆరోపిస్తే పైన పేరొన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన డిజైన్ మాన్యువల్స్, సర్యూలర్స్, కోడ్స్‌ను తప్పుబట్టడమే.
మెత్తటి శాండ్ స్టోన్ పొరను కూడా ఎన్డీఎస్ఏ రిజిడ్ పొరగా భావించింది. మెత్తటి శాండ్ స్టోన్ (సాఫ్ట్ శాండ్ స్టోన్) పొర దాకా రాఫ్ట్ వేయడం వారికి అభ్యంతరకరంగా తోచింది. కానీ, మెత్తటి శాండ్ స్టోన్ అనేది రిజిడ్ పొర కాదు. అందులోంచి కూడా నీరు చొరబడి బయటకు వస్తుంది. ఇసుకతో పోలిస్తే కొద్దిగా తకువ వేగంతో వస్తాయి. జియాలజిస్టుల వర్గీకరణ ప్రకారం మెత్తటి శాండ్ స్టోన్ పొరను పర్మియబుల్ లేయర్ గానే పరిగణించాలి. సీడీవో ఇంజినీర్లు కూడా అదే వర్గీకరణను పరిగణలోకి తీసుకున్నారు.
వారి అభిప్రాయం ప్రకారం బరాజ్‌లను ఫ్లోటింగ్ స్ట్రక్చర్ (తేలియాడే నిర్మాణం)గా డిజైన్ చేశారు, నిర్మాణ విభాగం వారు ఫ్లోటింగ్ స్ట్రక్చర్గానే కట్టారు. కాబట్టి ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి ఇస్తే రిజిడ్ స్ట్రక్చర్(దృఢ నిర్మాణం)గా నిర్మించారని ఆరోపించడం సాంకేతికంగా చర్చకు నిలబడే అంశం కాదు. ఎన్డీఎస్ఏ వారి వాదనే నిజమైతే ఆ సమస్య బరాజ్ పొడవునా వచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఈ కుంగుబాటు ఏడో బ్లాక్‌లోనే జరిగిందని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ఇంజినీర్లు 2023 నవంబర్లోనే ఎన్డీఎస్ఏకు విపులంగా వివరణ ఇచ్చారు.అయినా కూడా శ్రీరాం మళ్లీ అదే పాత ఆరోపణను ఎత్తిపోసి రాయడం శోచనీయం.
తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభపై ఆరోపణలా?
తెలంగాణ ఇంజినీర్ల ఇంజినీరింగ్ పరిజ్ఞానం మీద, వారి ఇంటిగ్రిటీ మీద దారుణమైన అపహాస్యానికి శ్రీరాం పాల్పడ్డారని నేను భావిస్తున్నా. మొదటి వ్యాసంలో కూడా ‘పరిశోధన ఒక చోట.. నిర్మాణం మరో చోట’ అనే ఉప శీర్షిక కింద ఆయన అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాల్లో భౌతిక పరిశోధనలు జరిపి నిర్మాణ సమయంలో వాటిని మరో చోటుకు మార్చి ఎలాంటి భౌతిక పరిశోధనలు చేయకుండానే నిర్మించారని మన ఇంజినీర్ల మీద చేసిన ఆరోపణ.
తొలుత ఎంపిక చేసిన స్థలంలో కాకుండా కొన్ని కిలోమీటర్ల దిగువన బరాజ్‌లు నిర్మించిన మాట వాస్తవమే. అలాంటి మార్పులు ఇంజినీర్లకు కొత్తేమీ కాదు. రకరకాల కారణాలతో నిర్మాణ స్థలాన్ని మార్చే పరిస్థితులు ఏర్పడుతాయి. నాగార్జునసాగర్ డ్యామ్‌ను మొదట ఏలేశ్వరం వద్ద ప్రతిపాదించారు. ఆ తర్వాత నందికొండకు మారింది. అట్లానే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను కూడా దిగువకు మార్చారు.
రిజర్వ్ ఫారెస్ట్ సేకరణను తగ్గించేందుకు, గ్రావిటీ కాలువ పొడవు తగ్గించేందుకు, బరాజ్‌లో నికర జల నిల్వ సామర్థ్యం (లైవ్ స్టోరేజీ) పెంచుకునేందుకు అన్నారం బరాజ్‌ను సుమారు 5 కిలోమీటర్లు కిందికి జరిపామని, దానికి అనుగుణంగానే సుందిళ్ల బరాజ్‌ను కూడా కొద్దిగా కిందికి జరుపాల్సి వచ్చిందని ఇంజినీర్లు పేరొన్నారు. ఇది తప్పు పట్టాల్సిన అంశమే కాదు. మార్చిన ఆ స్థలంలో ఎలాంటి భౌతిక పరిశోధనలు చేయకుండానే బరాజ్‌లు నిర్మించారనడం అబద్ధం.
ఇంజినీర్లు ఎవరైనా అలాంటి మూర్ఖపు పని చేస్తారా? అకడ కూడా భౌతిక పరిశోధనలు చేసి వాటి ఫలితాలను సీడీవోకు పంపారు. వాటి ఆధారంగానే పైన పేరొన్న సీబీఐపీ, సీడబ్ల్యూసీ, బీఎస్ఐ వారు జారీ చేసిన డిజైన్ మాన్యువల్స్, సర్యూలర్లు, కోడ్స్‌ను తు.చ తప్పకుండా పాటించి సీడీవో డిజైన్లను రూపొందించారు. తెలంగాణ ఇంజినీర్లపై ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేసేందుకు శ్రీరాంకు మనసెట్లా వచ్చింది?
అంతిమంగా వెదిరె శ్రీరాం వ్యాస పరంపర అంతా రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాస్తున్నదే తప్ప బరాజ్‌లకు గాని, తెలంగాణ రాష్ర్టానికి గాని ఏ రకంగానూ పనికొచ్చేది కాదు. ఇది నిజాయితీ లోపించిన మరో భావజాల ఎత్తిపోతల పథకం అని నా అభిప్రాయం. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు ఆయన మళ్లీ అవే విషయాలను చెప్పుకొస్తున్నారు. బరాజ్ పిల్లర్లు కుంగిపోయేందుకు కారణాలు నదీగర్భంలో భౌతిక పరిశోధనలు చేసిన తర్వాత గాని తెలియవు. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కానేలేదు.
వారు మాత్రం తమ ఊహాగానాలతో నిర్ధారణ చేసి పారేస్తున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన నాటి నుంచి మేడిగడ్డ వద్ద గాని, పైన ఉన్న అన్నారం, సుందిళ్ల వద్ద గాని భౌతిక పరీక్షల ఫలితాలు ఇంకా అందనే లేదు. అయినా ఐదు నెలల తర్వాత శ్రీరాం ఇప్పుడు అదే ఊహాగానాల నివేదికను మకీకిమకీ అనువాదం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో తాను అంటకాగుతున్న పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు.
Prakash
వరదాయిని కాళేశ్వరం
ఆంధ్రజ్యోతిలో వెదిరె శ్రీరాం రాసిన కాళేశ్వరంపై వ్యాసాలకు వీ ప్రకాశ్ కౌంటర్