హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించేందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తక్కువ ఖర్చుతోనే అంచనాలను సిద్ధంచేయాలని సూచించినట్టు సమాచారం. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానంగా తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై చర్చించినట్టు తెలిసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 152 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ను నిర్మిస్తామని, మహారాష్ట్రను ఒప్పిస్తామని కాంగ్రెస్ చెప్తున్నది.
ఈ నేపథ్యంలో దానిపై చర్చించారు. అయితే, ప్రస్తుతం 152 మీటర్లతో కాకుండా 150 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తోనే బరాజ్‌ను నిర్మించేందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. అదేవిధంగా మోడికుంట, చనాక-కొరాట, చిన్నకాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు పాల్గొన్నారు.