Yasangi Grain | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం ఉత్పత్తిపై మంత్రి ఉత్తమ్ ఒక మాట చెప్తుంటే.. పౌరసరఫరాలశాఖ మరో మాట చెప్తున్నది. సివిల్‌సైప్లె భవన్లో శనివారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ యాసంగిలో 127.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. పౌరసరఫరాల శాఖ మాత్రం ఈ సీజన్లో 137.10 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. మంత్రి, అధికారుల మధ్య ఏకంగా 10 లక్షల టన్నుల ధాన్యం తేడా ఉండటం గమనార్హం. ధాన్యం కొనుగోళ్లలో కోత పెట్టేందుకే దిగుబడిని తక్కువగా అంచనా వేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యాసంగి సీజన్లో రికార్డ్‌స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతుందని పేరొన్నారు. ఇందుకు తగ్గట్టుగానే మొత్తం ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలిపారు. ఈ యాసంగి సీజన్లో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఇందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ సంవత్సరం వానకాలం, యాసంగి సీజన్లు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని చెప్పారు.
శుక్రవారం నాటికి 8.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరగా ఇప్పటికే 5.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇందులో సన్నరకాలు 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా 1.98 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో 2.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. 8,329 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించగా, ఇప్పటికే 7,337 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. 17.5 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా 9.45 కోట్లు కొత్తవి, 8.05 కోట్లు పాతవి ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.