హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ) : సమీకృత సీతారామ, సీతమ్మసాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. నిర్దేశిత గడువులో ఆయకట్టుకు నీరందించాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించేందుకు సమీకృత సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 7 లక్షల ఎకరాలకు నీళ్లు అందనున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు ప్రాజెక్టు ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీలను తవ్వాల్సి ఉన్నది. అయితే క్షేత్రస్థాయిలో భూసేకరణతోపాటు ఇతర సమస్యలు అడ్డొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పురోగతిపై ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఉత్తమ్ శనివారం జలసౌధలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను సీఈ శ్రీనివాస్‌రెడ్డి మంత్రులకు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. భూ సేకరణ, కాల్వల తవ్వకం, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందుకు సైతం సాగునీటిని అందించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మంత్రులను కోరగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.