హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలవారీగా ప్రాజెక్టులు, భూసేకరణ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ.. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ, పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. భూసేకరణ జాప్యమైతే నిర్మాణ అంచనాలు రెట్టింపవుతాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యమివ్వాలని సూ చించారు. రాజేంద్రనగర్‌లోని వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను బలోపేతం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని, క బ్జాకు గురైన ఇనిస్టిట్యూట్ భూమిపై సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని మంత్రి ఆదేశించారు.