హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సీతక్కతో కలిసి శనివారం సచివాలయం నుంచి సమీక్షించారు. ముఖ్యంగా రామప్ప-లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ గ్రావిటీ కెనాల్‌కు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలని, మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు అంచనాలు రూపొందించి నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కెనాల్ నిర్మాణాన్ని రెండేండ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పొట్లాపూర్ ప్రాజెక్టు పనులకు వచ్చే వారంలోనే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.