హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : గోదావరి-బనకచర్లపై బీఆర్ఎస్ గళం వినిపించిన తర్వాతే ప్రభుత్వం నిద్రమేల్కొని ఉత్తరాలు రాయడం మొదలుపెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో సహా వెల్లడించారు. తాను ఈ ఏడాది జనవరి 24న సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహిస్తే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాత తేదీలతో లేఖ రాసినట్టు చెప్తూ అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు లేఖలను మీడియాకు లీక్ చేశారని చెప్పారు. మూడు రోజుల కింది తేదీలు వేసి లేఖ విడుదల చేశారని, నిజంగా మూడు రోజుల ముందే లేఖ రాసి ఉంటే అప్పుడే విడుదల చేయాలి కదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ ముల్లుకట్టె పట్టి పొడిస్తేనే.. ప్రశ్నిస్తేనే లేఖ రాశారని చెప్పారు. నేను నాలుగు గంటలకు ప్రెస్‌మీట్ పెడితే.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎనిమిది గంటలకు లేఖను విడుదల చేయడంతోనే అడ్డంగా దొరికిపోయారని చెప్పారు.
‘అదే జనవరి 27న మీకు కూడా బాధ్యత ఉన్నది.. పట్టించుకోండని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసిన. మార్చి 5న బనకచర్లపై దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మరోసారి ప్రెస్‌మీట్ పెట్టిన. ఆ తర్వాత మే 25న మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టిన. జూన్ 6న మరోసారి ప్రెస్‌మీట్ పెట్టిన. జూన్ 14న నేను బనకచర్లపై సమగ్ర వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన. సాయంత్రం నాలుగు గంటలకు నేను పీపీటీ పెట్టి బనకచర్లపై వాస్తవాలను ప్రజల ముందు పెట్టడంతో ప్రభుత్వం వెంటనే సాయంత్రం అయిదున్నరకు మళ్లీ పాత తేదీలు వేసి బనకచర్లపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వాస్తవాలను ఎవ్వరైనా పరిశీలించుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన ప్రెస్నోట్లు, ప్రెస్మీట్లు చూడాలి’ అని విజ్ఙప్తి చేశారు.
‘గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకుపై అసలు పోరాడింది బీఆర్ఎస్.. మొద్దునిద్ర పోతున్న కాంగ్రెస్‌ను, ప్రభుత్వాన్ని ముల్లుకట్టెతో గుచ్చి నిద్రలేపింది బీఆర్ఎస్, ఈ రోజు టీవోఆర్ ఆగిందంటే అది బీఆర్ఎస్ వల్లే. టీవోఆర్ ఆగడం తాత్కాలికమే. కానీ రేవంత్‌రెడ్డి దొరికిపోయిండు. అందుకే బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నడు. బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది.. కేసీఆరే చేసిండు అని చిల్లర ప్రయత్నాలు, చిల్లర ప్రచారం చేస్తున్నడు. అసలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బనకచర్లపై చర్చ జరిగిందా? బనకచర్ల అని ఉన్నదా రేవంత్‌రెడ్డీ? అపెక్స్ కౌన్సిల్లో ఎవరెవరు ఏం మాట్లాడారన్నది కౌన్సిల్ మీటింగ్ మినిట్స్‌లో ఉన్నది. 12 పేజీల మినిట్స్ అందుబాటులో ఉంది. అందులో ఎక్కడా బనకచర్ల అన్న మాట కూడా లేదు’ అని హరీశ్ వివరించారు. ‘సముద్రంలో 3వేల టీఎంసీల నీళ్లు కలుస్తున్నాయి. రెండు రాష్ర్టాలకు నీళ్ల ఇబ్బంది ఉన్నది.
రెండు రాష్ర్టాలు కూర్చొని, ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో అన్నదానిపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని మాత్రమే అపెక్స్ కౌన్సిల్ మినిట్స్‌లో ఉన్నదని చెప్పారు. ఇక్కడ ఎక్కడా బనకచర్ల కట్టుకోమని, ఆంధ్రప్రదేశ్‌కు రాసిచ్చినట్టు ఉన్నదో? చెప్పాలి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకెళ్తే తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ ఎక్కడ సంతకం చేశారో రేవంత్ చెప్పాలని నిలదీశారు. ‘అపెక్స్ కౌన్సిల్లో ఎక్కడా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లను ఇస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ తీసుకొనిపోవచ్చన్నట్టు ఉన్నదా? ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో నీళ్లను తీసుకొనిపోవచ్చని మాత్రమే ఉన్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తనకు ఆమోదయోగ్యమైన పద్ధతి ఏమిటో చెప్పలేదు.. ముం దుకు రాలేదు’ అని స్పష్టం చేశారు. రెండు ప్రభుత్వాలతో తాము ఆనాడు మాట్లాడే ప్రయత్నం చేశామని, సాగర్, శ్రీశైలంల గుండా.. నదీ మార్గంలో నీళ్లు తీసుకెళ్లాలన్న ప్రతిపాదన వచ్చిందని, కానీ చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి ఇద్దరూ దీనిపై ముందుకు వెళ్లలేకపోయారని, బీఆర్ఎస్ ఉన్నపుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, అలాంటిది ఇప్పుడే ఎందుకు అడుగు ముందుకు పడుతున్నదని నిలదీశారు.
గురుదక్షిణ చెల్లించుకుంటున్నవురేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడని, ఇందులో భాగంగానే బనకచర్లను కట్టుకునేందుకు సహకరిస్తున్నాడని హరీశ్ విమర్శించారు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్లోని పేరాగ్రాఫ్ 5లో ఆనాటి సీఎం కేసీఆర్ ఏమన్నారో ఉన్నదని, దాన్ని రేవంత్‌రెడ్డి చదవలేదని చెప్పారు. తెలంగాణతో సంప్రదించకుండా, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీటిని మళ్లించడం పట్ల, ఆ కమిటీలో సభ్యుల తీరుపట్ల కేసీఆర్ నిరసన వ్యక్తం చేశారని స్పష్టంగా ఉన్నట్టు తెలిపారు.
పెన్నా గురించి అసలున్నదా?
‘రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ మంగళవారం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో 2016లో బనకచర్లను కేసీఆర్ ఏపీకి రాసిచ్చినట్టు మాట్లాడారు. ప్రజెంటేషన్ హెడ్డింగ్‌లోనే 2016లో గోదావరి- పెన్నా నదుల అనుసంధానం అని పెట్టారు. అసలు 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఎక్కడైనా అసలు పెన్నా గురించి ఉన్నదా?’ అని హరీశ్ ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో పెన్నా నది గురించి, ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీళ్లను ఇచ్చే విషయం గురించి ఎలాంటి ఒప్పందం జరగలేదని, ఏపీకి నీళ్లిచ్చేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని పునరుద్ఘాటించారు.
అవగాహనలేని రేవంత్‌రెడ్డి
నీటి సంబంధ విషయాల్లో రేవంత్‌రెడ్డికి అవగాహనలేదని, తొలుత జూన్ 18న సీఎం రేవంత్ మాట్లాడుతూ వెయ్యి టీఎంసీలు గోదావరిలో, 500 టీఎంసీలు కృష్ణాలో ఇస్తే చాలని మాట్లాడారని, ‘మిగిలిన నీళ్లను చంద్రబాబు ఎన్నయినా తీసుకోనీ, ఎన్నయినా వాడుకోనీ, మాకేమీ అభ్యంతరం లేదు’ అంటూ బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారని గుర్తుచేశారు. అయితే, రేవంత్‌రెడ్డిని తాను జూన్ 19న నిలదీశానని, తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబుకు పణంగా పెట్టే చర్యలను ఒప్పుకోబోమని తేల్చిచెప్పానని, తెలంగాణ ప్రయోజనాలకు కాపాలా ఉండటమే తప్ప ఇక్కడి ప్రజల హక్కులను, ప్రయోజనాలను చంద్రబాబుకు తాకట్టు పెడితే ఊరుకోబోమని చెప్పినట్టు తెలిపారు. తాము అనడంతో జూలై 1న రేవంత్‌రెడ్డికి జ్ఙానోదయం అయ్యిందని, వరద జలాల్లో కూడా తెలంగాణకు వాటా ఉంటుందని మాట్లాడారని గుర్తుచేశారు.
మిగులు జలాల్లో కూడా తెలంగాణకు వాటా ఉంటుందన్న విషయాన్ని బీఆర్ఎస్ చెప్పడంతోనే రేవంత్‌రెడ్డికి తెల్సిందని, ఈ విషయంలో బీఆర్ఎస్ చెప్తేనే రేవంత్‌కు జ్ఞానోదయం అయ్యిందని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రశ్నించకుంటే, అడగకుంటే రేవంత్‌రెడ్డి అజ్ఞానం వల్ల తెలంగాణకు గోదావరి జలాల విషయంలో తరతరాల నష్టం జరిగి ఉండేదని వాపోయారు. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయమని, 3 వేల టీఎంసీలు అనేది కేసీఆర్ సృష్టించిన బ్రహ్మపదార్థమంటూ రేవంత్‌రెడ్డి మాట్లారని, రేవంత్‌రెడ్డి అజ్ఞానానికి , అవగాహనలేమికి ఈ వ్యాఖ్యలే నిదర్శనని ఎద్దేవాచేశారు. 3 వేల టీఎంసీలన్నవి సీడబ్ల్యూసీ గేజ్ రిపోర్టుల ద్వారా తేలిన లేక్క అన్న విషయం కూడా రేవంత్‌కు తెలియదని దెప్పిపొడిచారు. ఏడాది వారీ లెక్కలు తీసి, 57 ఏండ్ల సగటు లెక్కిస్తే ఏడాదికి 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వమే తేల్చిందని, ఇదే విషయాన్ని కేసీఆర్ చెప్తే హాఫ్ నాలెడ్జి ఉన్న రేవంత్‌రెడ్డి దీన్ని తెలుసుకోకుండా ఏదో మాట్లాడారని, చివరికి జ్ఞానోదయమై సవరించుకొని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
అపెక్స్ కౌన్సిల్ మినిట్స్‌లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు ఇస్తున్నట్టు.. ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోవచ్చు అన్నట్టు ఉన్నదా? రెండు రాష్ర్టాలకు ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో నీళ్లను తీసుకొని పోవచ్చు అని మాత్రమే ఉన్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తనకు ఆమోదయోగ్యమైన పద్ధతి ఏమిటో చెప్పలేదు.. ముందుకు రాలేదు. ఈ దిశగా ఎలాంటి తదుపరి చర్యలు, చర్చలే జరగలే. కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. అది బాబైనా.. జగనైనా! -హరీశ్‌రావు
గోదావరి-పెన్నార్ లింక్ (బనకచర్ల) ప్రాజెక్టుతోపాటు ఏపీ చేపట్టిన అనధికార ప్రాజెక్టులను నిలువరించాలని కేంద్ర జలశక్తిశాఖ మంత్రికి మాజీ మంత్రి హరీశ్‌రావు 2023 జూలై10న రాసిన లేఖ