వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కృష్ణా జలాల దోపిడీతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని భావించి మంత్రి పదవులను త్యాగం చేసిన చరిత్ర మాది. నాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్క పీజేఆర్ (పీ జనార్దన్‌రెడ్డి) మాత్రమే తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి పదవుల కోసం పెదవి మూసుకున్నడు.
– హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : త్యాగాల చరిత్ర తమదని, ద్రోహాల చరిత్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని తేల్చిచెప్పారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పోరాటం చేసిందే బీఆర్ఎస్ అని స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ వేదికగా కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు మాట్లాడి సభను తప్పుదోవపట్టించారని విమర్శించారు. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎకువ ప్రాజెక్టులు లేవని, అందుకే 299 టీఎంసీల నీటిని తాతాలికంగా కేటాయించారని వివరించారు. ఆ పాపం కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ ఢిల్లీకి వెళ్లి ఇంకా అదే 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకొని వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి నీటిని ఎత్తుకెళ్తుంటే పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్ స్పష్టంచేశారు. కృష్ణానీటిని ఎత్తుకెళ్తున్నందుకు నిరసనగా నాడు ఆరుగురం మంత్రి పదవులకు రాజీనామా చేసి 40 రోజులు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీని స్తంభింపజేశామని గుర్తుచేశారు. ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్క పీజేఆర్ మాత్రమే తమతో గొంతుకలిపారని, ఉత్తమ్ సభలో ఉన్నా మంత్రి పదవి ఆశతో పెదవులు మూసుకున్నారని ధ్వజమెత్తారు.
బాబుతో భోజనం చేసొచ్చి మౌనం మంత్రి ఉత్తమ్‌కుమార్ దంపతులు విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలిసి భోజనం చేసి వచ్చాక కృష్ణాజలాల విషయంలో మౌనం వహిస్తున్నారని హరీశ్ విమర్శించారు. శ్రీశైలం ఖాళీ చేసే విధంగా ఆ భేటీ దోహదం పడిందని, హుజూర్‌నగర్‌ను ముంపునకు గురిచేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లిచ్చారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మించటంతో ఖమ్మం జిల్లాకు నీళ్లివ్వగలిగారని చెప్పారు.
తెలంగాణకు కృష్ణానది జలాల వినియోగ హక్కును సెక్షన్ 3 ద్వారా సాధించామని, అది ముమ్మాటికీ కేసీఆర్ కృషి ఫలితమేనని హరీశ్ పేర్కొన్నారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల్లో రాష్ర్టానికి 575 టీఎంసీల వాటా దక్కిందని వివరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తించాలని, పులిచింతల ప్రాజెక్టుల నిర్వాసితులను నిర్దయగా వదిలేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి వందల కోట్లు చెల్లించి కాపాడుకున్నదని తెలిపారు.
కృష్ణానదిలో తెలంగాణ వాటా కోసం పేగులు తెగేదాకా కొట్లాడిన చరిత్ర మాదైతే తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర ఉత్తమ్‌కుమార్‌రెడ్డిది. నల్లగొండలో పంటలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ! కృష్ణా నీళ్లను సముద్రంలో కలిపిన పాపమూ కాంగ్రెస్ పార్టీదే!
– హరీశ్‌రావు