హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): నిరుడు అక్టోబర్‌లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయలేదని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వారిని రిలీవ్ చేయాలని, మల్టీ జోన్-2లోని జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు కూడా చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. గురువారం మధ్యాహ్నం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యూ పోచయ్య(ఎస్టీఎఫ్ టీఎస్) అధ్యక్షతన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
టెట్ విషయంలో ఉపాధ్యాయులకు స్పష్టత ఇవ్వడంలో విద్యాశాఖ కమిషనర్ నిర్లక్ష్యం వహించడాన్ని స్టీరింగ్ సమావేశం తీవ్రంగా ఖండించింది. ఎన్నికల అనంతరం సీఎం, ప్రధాన కార్యదర్శిని కలిసి విద్యాశాఖ కమిషనర్‌పై పిర్యాదు చేయాలని నిర్ణయించింది. సమావేశంలో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కే జంగయ్య, చావ రవి(టీఎస్ యూటీఎఫ్), పీ నాగిరెడ్డి(టీపీటీఎఫ్), టీ లింగారెడ్డి(డీటీఎఫ్), జాడి రాజన్న(ఎస్సీఎస్టీఎఫ్), జాదవ్ వెంకట్రావు(ఎస్సీఎస్టీ టీఏ), ఎస్ హరికిషన్, వీ శ్రీనునాయక్(డీటీఏ), బీ కొండయ్య(ఎంఎస్టీఎఫ్), వై విజయకుమార్(ఎస్సీఎస్టీ యూఎస్), టీ లక్ష్మీరెడ్డి(టీఎస్ యూటీఎఫ్) పాల్గొన్నారు.