న్యూఢిల్లీ, మే 14: హెచ్1బీ వీసా ప్రోగ్రామ్, దాని చుట్టూ అల్లుకున్న వ్యవస్థలపై అమెరికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్ తీవ్ర విమర్శలు చేయడంతో హైదరాబాద్‌లోని వీసా ఆలయం లేదా వీసా బాలాజీగా ప్రసిద్ధి చెందిన చిల్కూర్ బాలాజీ ఆలయం ఒక అంతర్జాతీయ చర్చకు కేంద్ర బిం దువుగా మారింది. హెచ్-1బీ, ఎల్1, ఎఫ్1, ఓపీటీ వం టి ఉపాధి ఆధారిత వీసా కార్యక్రమాలను విమర్శిస్తూ బుధవారం ఎక్స్‌లో రిపబ్లికన్ సెనేటర్ ష్మిట్ థ్రెడ్‌ను పోస్టు చేసిన తర్వాత వేలాదిమంది ఐటీ నిపుణులు, విద్యార్థులు అమెరికా వీసాలు పొందడంలో విజయంకోసం ప్రార్థించే 500 ఏండ్ల పురాతనమైన ఆ చారిత్రక పుణ్యక్షేత్రం చర్చనీయాంశంగా మారింది.
వీసాపై ఆధారపడిన కార్మికులను పశువుల్లా చూస్తున్నారని ఆరోపించారు. తన ఆరోపణల్లో భాగంగా హైదరాబాద్‌లోని ప్రఖ్యాత వీసా ఆలయాన్ని ప్రపంచ వీసా వ్యవస్థ పరిమాణానికి, వ్యవస్థీకరణకు ప్రతీకగా ష్మిట్ అభివర్ణించారు. ‘వీసా ముఠాకు హైదరాబాద్‌లో దాని సొంత వీసా ఆలయం ఉంది. అక్కడ వేలాదిమంది భారతీయులు ప్రదక్షిణలు చేస్తూ యూఎస్ వర్క్ వీసాల కోసం పాస్‌పోర్టులకు ఆశీర్వాదం పొందుతారు’ అని ష్మిట్ విమర్శించారు.