Urea Shortage | రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతకు యూరియా కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పొద్దంతా క్యూలో నిల్చున్నా అసలు దొరుకుతుందో.. లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సొసైటీలకు సరిపడా యూరియా రాకపోవడం.. పెద్ద సంఖ్యలో రైతులు వేచి చూస్తుండటం.. రానివారు నిరాశతో వెనుదిరుగడం నిత్యం పరిపాటిగా మారింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా యూరియా కొరత ఏర్పడిందని కర్షకలోకం భగ్గుమంటున్నది. పలు ప్రాంతాల్లో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రమంతా గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లలో ఉంటే తాము మాత్రం ఇలా యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో సమస్య తీవ్రమవుతున్నా సీఎం టూర్లకు వెళ్తుండటం.. మంత్రులు పట్టనట్టు వ్యవహరించడం ఏంటని రైతాంగం నిలదీస్తున్నది. ఇంకెన్ని రోజులు ఈ గోస భరించాలని మండిపడుతున్నది. నిద్రాహారాలు మరిచి గంటల తరబడి లైన్లు కట్టి, ఆకలితో సొమ్మసిల్లి పడిపోతున్న తోటివారిని చూసి కన్నీటిపర్యంతమవుతున్నది.జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద తెల్లవారుజామునే రైతులు తరలివచ్చారు. సిబ్బంది రాగానే క్యూలైన్ కట్టారు. రైతులతోపాటు మహిళా రైతులు, కుటుంబ సభ్యులు సైతం వచ్చి బారులుదీరారు.
కొందరు ఆకలితో హోటళ్ల నుంచి భోజనం తెప్పించుకొని అక్కడే తిన్నారు. పొద్దంతా క్యూలో నిలబడినా కొందరికి సరిపడా బస్తాలు అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
మహబూబాబాబాద్ జిల్లా నర్సింహులపేట వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం తెల్లవారుజామునే వానను సైతం లెకచేయకుండా చలికి వణుకుతూ రైతులు క్యూలో నిలబడ్డారు. మూడు రోజులుగా యూరియా బస్తాలు రాకపోవడంతో బారులు తీరారు.
జనగామ జిల్లా పాలకుర్తి ఎఫ్ఎస్సీఎస్ కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. పోలీస్ పహారా నడుమ బ్యాంక్ సిబ్బంది, అధికారులు పంపిణీ చేశారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక సింగిల్ విండో పరిధి రాజాపూర్‌లో గోదాంకు 340 బస్తాలు రాగా, రైతులు ఎగబడ్డారు. దీంతో షటర్ మూసి పంపిణీని నిలిపివేశారు.
యూరియా కోసం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలో యూరియా అందలేదని రైతులు ఆగ్రహానికి లోనై ఉన్నత పాఠశాల ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. యూరియా తెప్పిస్తామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
భద్రాద్రి జిల్లా గుండాల సొసైటీ కార్యాలయంలో కొందరు మహిళలు యూరియా కోసం వచ్చి సోమవారం లైన్ కట్టారు. చివరకు అందకపోవడంతో రాత్రిపూట అక్కడే నిద్రించారు. మంగళవారం ఉదయం క్యూలో ఉండి యూరియా తీసుకెళ్లారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో మార్కెట్‌యార్డుకు 230 బస్తాల యూరియా రాగా, పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్సులు క్యూలో పెట్టి కార్యాలయం తెరిచేవరకు నిరీక్షించారు. 300కు పైగా రైతులు తరలిరాగా, చివరకు కొందరికి అందలేదు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పీఏసీఎస్ వద్ద ఉదయం ఐదు గంటల నుంచి 500 మంది రైతులు యూరియా కోసం పడిగాపులుకాశారు. ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలు, ఒక నానో యూరియా బాటిల్ చొప్పున 222 మందికి పోలీసు పహారాలో పంపిణీ చేశారు. మిగతావారు నిరాశతో వెనుదిరిగారు.