నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 27: వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అనేకచోట్ల తెల్లవారుజాము నుంచే గజగజ వణికించే చలిలో కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. రోజంతా కష్టపడి క్యూలో నిల్చున్నప్పటికీ బస్తా కూడా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. బారులుతీరే క్రమంలో అక్కడక్కడ తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ఉదయం వరంగల్ జిల్లా ఖిలావరంగల్ పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం తిండీతిప్పలు మాని గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ సొసైటీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచే రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
శనివారం ఉదయం సొసైటీ వద్ద క్యూలో తోపులాట జరగడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. మూడు సునీత కాలు బెణికి గాయపడింది. యూరియా నిల్వ చేసి మూడు రోజులైనా అధికారులు పంపిణీ చేయడంలేదని పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా ఖానాపురం రైతువేదిక వద్దకు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన మహిళా రైతులు చలికి వణుకుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఒక్కో రైతుకు బస్తా చొప్పున అందజేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో యూరియా లభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ శివారులోని సర్వాయిపల్లి గోదాముకు బొప్పాపూర్ రైతులు తరలివెళ్లగా, అప్పటికే కోరుట్లపేట రైతులు బారులు తీరి ఉన్నారు. అధికారులు ఎకరానికి ఒకే బస్తా ఇవ్వగా, చాలామంది రైతులకు అందలేదు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్దకు శనివారం తెల్లవారుజామున రైతులు పరుగులు తీశారు.

యాప్‌లో అప్లోడ్ చేస్తేనే యూరియా వస్తుందని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. కల్లూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వేంసూరు సొసైటీ పరిధి వద్ద భీమవరం, లింగపాలెం గ్రామాలకు చెందిన రైతులు బారులుతీరారు. రైతులు క్యూలో ఉండగా తోపులాట జరిగింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి ఆగ్రోస్ కేంద్రానికి యూరియా కోసం సముందర్‌పల్లి, కాండ్లీ గ్రామాల నుంచి వంద మందికిపైగా మంది రైతులు తరలివచ్చారు. ఎకరాకు బస్తా చొప్పున పంపిణీ చేయడంతో కొందరికి దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో శనివారం మధ్యాహ్నం రైతులు కీ ప్యాడ్ ఫోన్స్ పట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం కారణంగా యూరియా పొందలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం రాజపేట తండా చౌరస్తాలోని మనగ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. 141 మంది రైతులు స్లాట్ బుక్ చేసుకోగా 40 మందికి కూడా యూరియా అందకపోవడంతో గొడవకు దిగారు.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో బస్తారాంతండాకు చెందిన రైతు గుగులోత్ రాజు శనివారం యూరియా కోసం నిరసనకు దిగాడు. ఏవో వినయ్‌కుమార్ కాళ్లమీద పడి.. ‘కాళ్లు మొక్కుతా.. బాంచన్ ఒక బస్తా యూరియా ఇప్పించండి’ అని దీనంగా వేడుకున్నాడు. మరో రైతు భూక్యా సూర్య సైతం యూరియా ఇప్పించండి సారు అంటూ ప్రాధేయపడ్డాడు. అయినా ఆ అధికారి కనికరించలేదు. విసుగు చెందిన సూర్య ఏవో బైక్ ముందు కూర్చొని ‘వ్యవసాయం చేయాలా? వద్దా?’ ఒకబస్తా రాసి ఇవ్వండి సారు’ అంటూ వేడుకున్నా ససేమిరా అన్నాడు.