కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో యూరియా కొరత లేనేలేదంటున్నరు. ఎరువుల దుకాణాల్లో ఫుల్ స్టాక్ ఉన్నదని చెప్తున్నరు. యూరియా కొరత లేకుంటే కేంద్రాల వద్ద పోలీసులు ఎందుకు? రోజురోజుకూ ఆగ్రో షాపుల ఎదుట అన్నదాతల బారులు దేనికి? సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో బుధవారం యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతుల నుంచి జిరాక్స్ పత్రాలు తీసుకొని నంబర్ రాసి పంపుతున్న పోలీసు
ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. సాగుపనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నరు. ఒక్కో బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ నిద్రాహారాలు మాని నిరీక్షిస్తున్నారు. పలు చోట్ల క్యూలో ఉన్నవారికి సైతం యూరియా బస్తాలు దొరక్కపోవడంతో చివరికి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో విరివిగా దొరికిన యూరియా .. కాంగ్రెస్ హయాంలో కనీసం ఒక్క బస్తా కూడా దొరకకపోవడంతో ప్రభుత్వంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
ఎక్కడ: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు సొసైటీ కేంద్రం
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వస్తుందని సమాచారం తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు బుధవారం వేకువజామున 5గంటల నుంచి బారులు దీరారు. సొసైటీ కేంద్రం నుంచి అంబేద్కర్ సెంటర్ సమీపం వరకు క్యూలో నిల్చొని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంత కష్టపడి క్యూలో ఉంటే ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా చొప్పున పంపిణీ చేయగా, బస్తాలు దొరకక సుమారు 200 మంది రైతులు వెనుదిరిగారు.
ఎక్కడ: వరంగల్ జిల్లా ఖానాపురం లో
ఏం జరిగింది: వరంగల్ జిల్లా ఖానాపురం మండలకేంద్రంలోని సొసైటీ ఎరువుల గోదాముకు యూరియా రావడంతో రైతులు బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. 888 బస్తాలు రాగా ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున అందజేశారు.
ఏం జరిగింది: కొణిజర్ల మండలం గోపవరం సొసైటీ కార్యాలయం వద్ద రైతులు తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. వర్షం కురుస్తుండటం.. సొసైటీ వద్ద సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తడుస్తూనే యూరియా బస్తాలు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఎక్కడ: మంచిర్యాల జిల్లా కోటపల్లిలో
ఏం జరిగింది: కోటపల్లి ప్రాథమిక సహకార కేంద్రానికి బుధవారం 200 యూరియా బస్తాలు రాగా, 600 మంది రైతులు క్యూ కట్టారు. 200 మందికి యూరియా బస్తాలు ఇవ్వగా, మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. చెన్నూర్‌లోని పీఏసీఎస్‌కు ఒకే లారీ లోడ్ రావడంతో రైతులకు సరిపడా యూరియా అందించలేదు. దీంతో రైతులు మంత్రి వివేక్‌పై మండిపడ్డారు. పట్టణానికి చెందిన రైతు చైతన్య ధర్నా చేపట్టడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఎక్కడ: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో
ఏం జరిగింది: గ్రామాల నుంచి వచ్చిన రైతులు బుధవారం తెల్లవారుజామునే సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద క్యూలో నిలబడ్డారు. తీరా అధికారులు వచ్చి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం గేట్‌కు యూరియా నో స్టాక్ బోర్డును ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తంచేశారు. వారం రోజులుగా తిరుగుతున్న యూరియా పంపిణీ చేయడం లేదని అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తంచేశారు.
ఎక్కడ: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా బయ్యారం సహకార పరపతి సంఘం పరిధిలోని ఉప్పలపాడు, కొత్తపేట, కంబాలపల్లిలో కొన్ని రోజులుగా యూరియా అందుబాటులో ఉండటం లేదు. మండల కేంద్రంలోని సొసైటీల కార్యాలయాలకు బుధవారం స్టాక్ వచ్చిందని తెలియడంతో ఉదయం ఆరు గంటల నుంచి సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. అయితే కేవలం 26 మెట్రిక్ టన్నుల(570 బస్తాలు) యూరియా మాత్రమే రాగా వచ్చిన స్టాక్‌ను కొంతమంది రైతులకు ఇవ్వడంతో చాలామందికి అందక వెనుదిరిగారు.
ఎక్కడ: మహబూబాబాద్ జిల్లా పొగుళ్లపల్లిలో
ఏం జరిగింది: సొసైటీ వద్ద యూరియా కోసం పట్టాపాస్ బుక్కులు, సంచులు క్యూలో పెట్టి గంటలకొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి సొసైటీ వద్ద నెలకొన్నది. నెలరోజులుగా యూరియా కోసం సొసైటీల వద్దనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఎదురైందని రైతులు మండిపడ్డారు.
ఎక్కడ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో
ఏం జరిగింది: అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీకి రైతులు ఉదయమే చేరుకొని పొద్దంతా నిరీక్షించారు. ఒక్క రైతుకు రెండు బస్తాల యూరియా ఇస్తామని సొసైటీ అధికారులు చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ రాలేదని రైతులు వాపోయారు.
ఎక్కడ: రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో
ఏం జరిగింది: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల సొసైటీకి 230 బ్యాగులు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎన్ని ఎకరాలున్నా ఒకే బస్తా ఇవ్వడంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. ఒక్కరోజు ముందు నుంచే క్యూలో ఉన్నా యూరియా అందకపోవడంతో పలువురు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఎక్కడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో
ఏం జరిగింది.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని నేరెల్ల సింగిల్ విండో గోదాం వద్ద మంగళవారం రాత్రి నుంచే క్యూ కట్టారు. ఉదయాన్నే పోలీస్ పహారాలో యూరియాను పంపిణీ చేశారు. ఒకరోజు ముందు నుంచే క్యూలో ఉన్నా యూరియా అందకపోవడంతో పలువురు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎక్కడ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో
ఏం జరిగింది: ఎల్లారెడ్డిపేటలో గ్రోమోర్ కేంద్రానికి 440 బ్యాగులు రాగా, రైతులు తెల్లవారుజాము 4:30 గంటల నుంచే బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 200 మందికే పంపిణీ చేసి, యూరియా అయిపోయిందని చెప్పడంతో మిగిలిన వారంతా ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎక్కడ: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ లో
ఏం జరిగింది: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలోని పీఏసీఎస్‌లో యూరియా కోసం.. బయోమెట్రిక్ వేసేందుకు రైతులు బారులు తీరారు. పొద్దస్తమానం క్యూలో నిలబడుతుండటంతో సాగు పనులు ముందుకు సాగడం లేదని పలువురు రైతులు వాపోయారు.
ఎక్కడ: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో
ఏం జరిగింది: యూరియా అందించాలని సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌లో తహసీల్ కార్యాలయం వద్ద బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే రహదారులను
దిగ్బంధిస్తామని రాధాకృష్ణశర్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.