హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కావాల్సినంత యూరియా లేదని, కేంద్రం నుంచి ప్రతినెలా లోటు సరఫరానే ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. యూరి యా లోటు, కేంద్రం తీరుపై బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియా సరఫరా లో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం, ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ ఖరీఫ్‌లో తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, ఏప్రిల్ నుంచి జూలై వరకు 32 శాతం లోటు సరఫరా అయిందన్నారు. మే లో 45శాతం, ఆగస్టులో 35 శాతం లోటు కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 2.67 లక్షల టన్నుల యూరియా తక్కువగా వచ్చిందని, ఈ లోటును తక్షణమే భర్తీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.