హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రైతులను వానకాలం సీజన్లో యూరియా (Urea) కొరత ఎంతగా వేధించిందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే యాసంగిలోనూ (Yasangi Season) యూరియా సంక్షోభం మళ్లీ ముంచుకొస్తున్నది. ఇక వరినాట్లు ప్రారంభమయ్యాక పరిస్థితి ఏంటని ఆందోళన కలిగిస్తున్నది. యూరియా కొరతకు ప్రధాన కారణమైన బఫర్ స్టాక్‌ను నిల్వ చేయడంలో సర్కార్ ఘోరంగా విఫలమవుతున్నది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు ప్రతి నెలా 2 లక్షల టన్నుల చొప్పున మొత్తం 6 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉంచాలని ప్రణాళిక రూపొందించింది. కానీ, ఇందులో సగం మాత్రమే సరఫరా అయింది. దీంతో యూరియా కొరత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వానకాలంలో నాడు బఫర్‌స్టాక్ తెప్పించకుండా ప్రభుత్వం యూరియా కొరతకు కారణమై రైతులను గోస పెట్టింది. ఇప్పుడు యాసంగిలోనూ ప్రభుత్వం అదే తప్పు చేస్తున్నది. వాస్తవానికి మార్క్‌ఫెడ్ వద్ద సీజన్ ప్రారంభానికి ముందే కనీసం 4 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉండాలి. కానీ, ఈ నెల 6వ తేదీ వరకు 1.4 లక్షల టన్నులు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు 6 లక్షల టన్నుల యూరియా సరఫరా అవుతుందని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. కానీ, ఇది బెడిసికొట్టింది. చివరికి డిసెంబర్ ప్రణాళికను 1.6 లక్షలకు తగ్గించింది. దీని ప్రకారం మూడు నెలలకు కలిపి 5.6 లక్షల టన్నులు సరఫరా కావాలి. కానీ, ఇప్పటి వరకు 3.78 లక్షల టన్నులు మాత్రమే సరఫరా కాగా, 1.82 లక్షల టన్నులు కోత పడింది. అక్టోబర్‌లో 2 లక్షల టన్నులకు 1.63 లక్షల టన్నులు సరఫరా కాగా, నవంబర్‌లో 2 లక్షల టన్నులకు 1.69 లక్షల టన్నులు సరఫరా అయింది. ఇక డిసెంబర్ ప్రణాళిక ప్రకారం 1.6 లక్షల టన్నులకు 46వేల టన్నులు మాత్రమే సరఫరా అయింది. సీజన్ ఏదైనా రైతులకు యూ రియా గోస తప్పేలా లేదు. వరినాట్లు మొదలుకాకముందే దుకాణాల వద్ద క్యూలైన్లు మొదలయ్యాయి. మరో 15 రోజుల్లో వరినాట్లు జోరందుకోనున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే జనవరి, ఫిబ్రవరిలో తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యాసంగిలో సాగులో జనవరి, ఫిబ్రవరి చాలా కీలకం. ఒక్క జనవరిలోనే 3.5 లక్షల టన్నుల యూరియా అవసరం. డిసెంబర్లో 1.5 లక్షల టన్నులు కావాల్సి ఉంటుంది. అంటే రెండు నెలలకు కనీసంగా 5 లక్షల టన్నుల యూరియా అవసరం. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వం వద్ద కలిపి మొత్తం 2.21 లక్షల టన్నులు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇందులో ప్రైవేటు డీలర్స్ వద్ద 60వేల టన్నులు, సొసైటీల వద్ద 20వేల టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 1.4 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. రైతులకు అందుబాటులో ఉండే ప్యాక్స్ సొసైటీల వద్ద కేవలం 20వేల టన్నులే ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొన్నది.
