అడవిదేవులపల్లి, సెప్టెంబర్ 19: యూరియా కొరత మరో మహిళా రైతు ప్రాణాలను తీసింది. లైన్లో నిల్చొని గాయాలపాలై 8 రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మహిళా రైతు పాతులోతు దస్సీ (55) గ్రామ పరిధిలో 30 గుంటల భూమిలో వరి సాగుచేశారు. యూరియా కోసం మండల కేంద్రంలోని రైతు వైదిక వద్ద రోజూ లైన్లో నిల్చుండేది. ఈ నెల 11న రైతులు భారీగా తరలి రావడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది.
ఈ సందర్భంగా దస్సీ కిందపడిపోగా, ఆమె తుంటి ఎముక విరిగి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దస్సీని మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నల్లగొండలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. అక్కడే తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్నది. అయినా కడుపు లోపలి గాయాలు తీవ్రమై ఆమె ఆరోగ్యం విషమించి, శుక్రవారం మృతిచెందింది. ఆమె వైద్యానికి సుమారు రూ.3 లక్షలకు పైగా ఖర్చయ్యాయని, తమకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఆమె భర్త కమ్ల తెలిపారు.
నెల్లికుదురు, సెప్టెంబర్ 19: మహబూబాబాద్ జి ల్లా నెల్లికుదురు సొసైటీలో శుక్రవారం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బొల్లు భరత్ రెండు యూరియా బస్తాలు తీసుకున్నాడు. అందులో ఒక బస్తాను తన బైక్‌పై ఇంటి వద్ద వేసి రెండో బస్తాను తీసుకొచ్చేందుకు తిరిగి నెల్లికుదురుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆకేరు వాగు బ్రిడ్జి సమీపంలోని మామిడితోట వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి పోయింది. దీంతో భరత్ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం భరత్‌ను వరంగల్ ప్రైవేటు దవాఖానకు తరలించారు.