హైదరాబాద్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): యూరియా (Urea) కోసం వేకువజాము నుంచే రైతులు పడ్డ అగచా ట్లు అన్నీ ఇన్నీ కావు. వానకాలం, యాసంగి.. కాలమేదైనా కొరత కామన్ అన్నట్టు యూరియా కోసం యావత్ రాష్ట్ర రైతాంగమంతా సొసైటీల వద్ద బారులు తీరి నరకం చూ సింది. మొన్న పత్తి కొనుగోళ్ల కోసం తెచ్చిన ‘కపాస్ కిసాన్ యాప్’తో (Kapas Kisan App) స్లాట్ బుకింగ్ కాక, బుక్ అయినప్పుడు వెళ్లలేక, దగ్గర్లోని మిల్లులో స్లాబ్ దొరకక పత్తి రైతు నరకం చూడాల్సి వచ్చింది. ఇప్పుడు యూరియా విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తూ రైతులపై మరో పిడుగు వేసింది. పంపిణీలో కోతలు పెట్టేందుకు రేవంత్ సర్కారు సన్నాహాలుచేస్తున్నది. ‘యూరియా బుకింగ్’ పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా ఫోన్లో బుక్ చేసుకుంటేనే పంపిణీ చేస్తారు.
అది కూడా వేసిన పంట రకాన్ని బట్టి కోటా అంటే ఎకరా వరికి కేవలం బస్తాలే కేటాయిస్తూ, నిబంధనల పేరుతో ఎరువులు అందకుండా కుట్రలు చేస్తున్నది. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మునుపటిలా అవసరమున్నంత యూరియా తీసుకెళ్లడం కుదరదు. యాప్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా ఒక రైతుకు ఎన్ని బస్తాల ఎరువులు ఇవ్వాలో ప్రభుత్వమే లెక్క తేల్చి.. ఇచ్చే బుకింగ్ యాప్‌ను ఈ నెల 20నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అంటే సర్కారు వారి అనుమతి ఉంటేనే.. రైతులకు యూరియా వస్తుంది. లేదంటే అంతే సంగతి. యూరియా పంపిణీలో కొత్త యాప్‌తో మరోసారి రైతులందర్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యాప్‌లో బుక్ చేస్తేనే యూరియా
ఇకపై రైతులు నేరుగా ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి యూరియా బస్తా కావాలంటే ఇవ్వరు. యాప్‌లో నమోదు చేసుకొని తద్వారా వచ్చిన ఐడీ నెంబర్ చెబితే యూరియా ఇస్తారు. ఈ యాసంగి నుంచి యూరియా పంపిణీకి ప్రభుత్వం ‘యూరియా బుకింగ్’ పేరుతో కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ యాప్‌లో ప్రతి రైతు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఆ రైతు పట్టాదార్ పాస్ పుస్తకం నంబర్‌ను ఎంటర్ చేయాలి. అదే విధంగా ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు రైతుకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయగానే సదరు రైతుకు ఒక ఐడీ సంఖ్య జనరేట్ అవుతుంది. ఆ రైతు ఆ ఐడీ నెంబర్ ఆధారంగా ఏ ఎరువుల దుకాణాదారు వద్దకైనా వెళ్లి ఐడీ నెంబర్ చెప్పి తనకు కేటాయించిన యూరియా బస్తాలను తీసుకెళ్లవచ్చు.
ఎన్ని బస్తాలో యాప్ చెప్పేస్తుంది
ఇకపై రైతులు తమకు అవసరాలకు అనుగుణంగా యూరియా బస్తాలు కొనుగోలు చేయడం కుదరదు. సర్కారు ఆదేశం ప్రకారమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రైతులకు ఎన్ని బస్తాలో ఇవ్వాలో, అవి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో యాప్‌లోనే లెక్క తేలుస్తుంది. అంతేగానీ ఒకేసారి వెళ్లి తనకు అవసరమైన పది బస్తాలు తీసుకొచ్చుకుందామంటే కుదరదు. తన మొత్తం భూమిలో ఏ రకం పంటను, ఎన్ని ఎకరాల్లో వేశారో యాప్‌లో నమోదు చేయాలి. దీని ఆధారంగా ఆ రైతుకు ఎన్ని బస్తాలు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే లెక్క చూపెడుతుంది. ఆ లెక్క ఆధారంగా రైతులు తనకు నచ్చిన ఎరువుల దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. ఇప్పటి వరకు రైతులు తాము ఎన్ని ఎకరాల్లో పంట వేశామో ఆ లెక్కన ఒకేసారి యూరియా బస్తాలను కొనుగోలు చేసేవారు. మళ్లీ మళ్లీ వచ్చి సమయం వృథా చేసుకోకుండా, ఆటో చార్జీలు భారం కాకుండా తన ఆర్థిక పరిస్థితిని బట్టి కొనుగోలు చేసేవారు. కానీ ఇకపై ఇలా కుదరదు. ఎప్పుడు వెళితే అప్పుడు ఇవ్వరు. 15 రోజులకు ఒకసారి మాత్రమే యూరియా బస్తాలు ఇస్తారు. ఇలా 3 విడతల్లో మాత్రమే పంపిణీ చేస్తారు. అయితే తనకు కేటాయించిన యూరియాలో మొదటి విడతలోనే ఎక్కువ తీసుకెళ్దామనే ఆలోచన చేస్తే కుదరదు. ఏ విడతలో ఎన్ని బస్తాలో ఇవ్వాలో లెక్కలేసి పెడతారు. అంతకు మించి ఒక్క బస్తా కూడా ఎక్కువ తీసుకెళ్లడానికి వీలుండదు.
వరి 2, మొక్కజొన్నకు 3 బస్తాలు
ఏ పంటకు ఎంత యూరియా వేయాలనే అంశంపై వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సుల ప్రకారమే కేటాయింపులు చేయనుంది. ఇందులో భాగంగానే ఎకరానికి ఏ పంటకు ఎన్ని బస్తాల యూరియా ఇవ్వాలో లెక్క తేల్చినట్లు తెలిసింది. ఎకరం వరికి కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా మొక్కజొన్నకు 3 బస్తాలు, జొన్న పంటకు 2 బస్తాలు, వేరు శనగకు ఒకే ఒక బస్తా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్తుననారు. దీని ప్రకారమే యాప్‌ను రూపొందించినట్లు తెలిసింది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రైతులు వరికి ఎకరానికి 3-5 బస్తాల యూరియా వేస్తారు, అదే విధంగా మొక్కజొన్నకు 10-14 బస్తాలు వేస్తారు. కొన్ని సందర్భాల్లో యూరియా వేసిన వెంటనే భారీ వర్షాలు పడితే ఆ యూరియా మొత్తం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు మరోసారి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా రైతుల అవసరాలను పట్టించుకోకుండా ఫలనా పంటకు ఇంతే ఇస్తామంటూ ‘లక్ష్మణ రేఖ’ గీయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు, కౌలు రైతులకు కొట్లాట!
యూరియా పంపిణీ కోసం తీసుకొచ్చిన యాప్‌తో సర్కారు ఇటు అసలు రైతులకు, కౌలు రైతుల మధ్య గొడవలు పెట్టించే ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్ ద్వారా కౌలు రైతులను చట్టబద్ధం చేసే కుట్ర జరుగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా తీసుకునేందుకు కౌలు రైతులకు కూడా ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేశారు. కౌలు రైతులు తమ ఆధార్ లింకు ఫోన్ నెంబర్‌ను నమోదు చేయడంతో పాటు అసలు రైతుల పాస్ బుక్ నెంబర్‌తో పాటు వారి ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇద్దరి ఓటీపీలు ఎంటర్ చేస్తే యూరియా కేటాయింపు చేస్తారు. ఈ విధంగా అసలు రైతులు తమ భూమిని ఇతర రైతులకు కౌలుకు ఇచ్చినట్లు అధికారికంగా నమోదు చేసినట్లు అవుతుంది. ఇది భవిష్యత్‌లో న్యాయ పరమైన ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుందనే ఆందోళన అసలురైతుల్లో వ్యక్తమవుతున్నది.
యూరియా పంపిణీలో కోతలకు కుట్ర
యూరియా పంపిణీకి కొత్తగా మొబైల్ యాప్ తీసుకురావడం, ఎకరానికి, పంటకు ఇన్ని బస్తాలేనని లెక్కతేల్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కూడా యూరియా పంపిణీలో కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తుందనే ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమవుతున్నది. ఇందుకు వానకాలం యూరియా పంపిణీ కష్టాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఎక్కడిక్కడ ధర్నాలు చేశారు. తీవ్ర ప్రజావ్యతిరేకత కారణంగా అప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే సాహసం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో సర్కారు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు గానూ యాప్‌ను తీసుకొచ్చి పంపిణీలో కోత పెట్టేందుకు కుట్రలు చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫోన్‌లేని రైతుల పరిస్థితి ఏంటి? ; వారికి యూరియా ఇవ్వరా?