అక్కన్నపేట, సెప్టెంబర్ 13: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో యూరియా బ్లాక్ దందా జోరుగా నడుస్తున్నది. నందారం గ్రామానికి చెందిన సంజీవరెడ్డి(రిటైర్డ్ ఆర్మీ జవాన్) బ్లాక్ మార్కెట్ నుంచి యూరియా తెప్పించి గ్రామంలోని రైతులకు అధిక ధరతో విక్రయిస్తున్నాడు. శుక్రవారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు నాలుగు బస్తాలు కావాలని అడుగగా, ఒక్కో బస్తా రూ. 500 అని చెప్పడంతో అతడు మండల వ్యవసాయాధికారి తస్లీమా సుల్తాన్‌కు ఫిర్యాదుచేశాడు. హుస్నాబాద్ ఏడీఏతో కలిసి జిల్లా వ్యవసాయాధికారి స్వరూపారాణి, ఏవో వెళ్లి వివరాలు సేకరించి బస్తాలు సీజ్ చేశారు. పోలీసులు సంజీవరెడ్డిపై కేసు నమోదుచేశారు. పోతారం(జే)లో లక్ష్మి ఫర్టిలైజర్ షాపు యజమాని రాజు తన వద్దకు వచ్చే రైతుల నుంచి ఒక్కో యూరియా బస్తాను రూ. 500కు విక్రయించి, ఇతర ఎరువులను అంటగట్టాడు. దీనిపై రైతులు ఫిర్యాదు చేయడంతో ఏవో, ఏఈవో వెళ్లగా షాపునకు తాళం వేసి పారిపోయారు. అధికారులు ఆ షాపు యజమానికి నోటీసులు అందజేశారు.