మద్దూర్, సెప్టెంబర్ 8: ‘పత్తి పూత దశతో ఉంది.. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు’ అని ఒక రైతు. ‘వరి పొట్ట దశలో ఉంది.. ఈ సమయంలో యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం’ అని మరొక రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ యూరియా కోసం అల్లాడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో నిల్చుండే వారు కొందరైతే.. మరుసటి రోజు కోసం అర్ధరాత్రి నుంచే సొసైటీల వద్దనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నవారు మరికొందరు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు దమగాన్పూర్ సహకార సంఘం, ఆగ్రో రైతు సేవా కేంద్రం, ప్రైవేటు ఫర్టిలైజర్‌కు యూరియా వచ్చిందని తెలుసుకొన్న రైతులు ఆదివారం అర్ధరాత్రి వెళ్లి పడిగాపులు కాశారు.
చంద్రగ్రహణం అని ప్రజలంతా ఇంటిపట్టునే ఉంటే.. రైతులు మాత్రం యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద జాగారం చేశారు. తెల్లవారే సరికి రైతులు తండోపతండాలుగా తరలివచ్చారు. యూరియా కొరత లేదని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి.. సొంత ఇలాకాలోనే అన్నదాత ఆక్రందన కనిపించడంలేదా అని రైతులు నిలదీశారు. కోస్గిలోనూ రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు. పంటల అదు ను దాటుతున్నా.. యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం ముందు యూరియా కోసం పెద్దసంఖ్యలో బారులుతీరిన వివిధ గ్రామాల రైతులు
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరులోని దమగాన్పూర్ పీఏసీఎస్ వద్ద ఆదివారం అర్ధరాత్రి యూరియా కోసం వచ్చి పడిగాపులు కాస్తున్న రైతులు
వానకాలం పంటల అదును దాటుతుండడంతో రైతులు అల్లాడిపోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి రోడ్డులోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద రైతుల సమస్యలను తెలుసుకొన్నారు.
తెలంగాణలో యూరియా కష్టాలకు కాంగ్రెస్ నాయకుల దురాశే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సోమవారం కాగజ్‌నగర్ మారెట్ కమిటీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో.. ఎస్సైతో వాగ్వాదం చేస్తున్న పోలీసులు, కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన రైతులను పక్కకు లాక్కెళ్తుండగా పోలీసు కాళ్లపై పడి వేడుకుంటున్న అన్నదాత
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో యూరియా కోసం కూపన్లు పంపిణీ చేస్తుండగా తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన రైతు కూరాకుల మల్లమ్మ
వనపర్తి జిల్లా మదనాపురం పీఏసీసీఎస్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం నిరీక్షించి, తోపులాటలో సొమ్మసిల్లి కింద పడిపోయిన కరివెన గ్రామానికి చెందిన వృద్ధ మహిళా రైతు దస్తగిరమ్మను దవాఖానకు తరలిస్తున్న తోటి రైతులు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం రైతు వేదిక వద్ద క్యూలో పెట్టిన ఆధార్, పట్టా పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను సిబ్బంది చిందరవందరగా పడేయగా, వెతుక్కుంటున్న రైతులు
కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్య నారాయణపురం సొసైటీ వద్ద క్యూలో నిల్చుని నీరసంతో పడిపోయిన తిప్పాపురం గ్రామ ఆదివాసీ రైతు సోమయ్య