హైదరాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): కొన్నిచోట్ల యాప్ అసలు ఓపెన్ కానేలేదు.. మరికొన్ని చోట్ల ఓపెన్ అయినా ఓటీపీలు రాలేదు.. ఇంకొన్ని చోట్ల యాప్‌లో యూరియా స్టాక్ చూపించలేదు.. మొత్తంగా అనుకున్నదే జరిగింది.. యూరియా బుకింగ్ మొబైల్ యాప్ అట్టర్‌ఫ్లాప్ అయింది. ఇదీ యూరియా పంపిణీ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’తో ఎదురైన చిక్కులు. శనివారం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ యాప్ తొలిరోజే పనిచేయలేదు. రైతులకు ఒక్కటంటే ఒక్క బస్తా యూరియా బుకింగ్ కాలేదు. ఒక్క యూరియా బస్తాను పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో ఎక్కడా యాప్ ఓపెన్ కానేలేదు. ప్రతిచోటా ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదురయ్యాయి. యాప్‌ను ప్రారంభించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.
తీరా యాప్ ఓపెన్ కాకపోవడంతో గంటలపాటు ఎదురుచూసిన కలెక్టర్లు చివరికి కార్యక్రమాలనే రద్దు చేసుకున్నారు. యాప్ ఓపెన్ కావడంలో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో వ్యవసాయ శాఖ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. సాంకేతిక సమస్యలపై చేతులెత్తేశారు. ఈ యాప్‌ను రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) అధికారులు సైతం చేతులెత్తేశారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచిచూసినా కూడా సమస్యలను పరిష్కరించలేకపోయారు. దీంతో సాయంత్రం చావుకబురు చల్లగా చెప్పినట్టు.. సాంకేతిక సమస్యల కారణంగా యాప్ ప్రారంభాన్ని సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులకు మెసేజ్ ఇచ్చింది.
పూర్తిగా సిద్ధంకాని యాప్‌ను రైతులపై రుద్దారు
అసలే సాంకేతికతతో కూడిన యాప్.. అపై నిరక్షరాస్యులైన రైతులు.. ఇలాంటి పరిస్థితుల్లో యాప్ రూపకల్పనలో, దాన్ని వినియోగించడంలో అధికారులు, ఐటీ నిపుణులు ఎంతో జాగ్రత్త వహించాలి. కానీ ఈ విషయాన్ని మరచి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పూర్తిగా సిద్ధంకాని యాప్‌ను బయటకు విడుదల చేసి రైతులతో ఆడుకునే ప్రయత్నం చేశారు. యూరియా బుకింగ్ కోసం తీసుకొచ్చిన ఈ యాప్ పూర్తిగా సిద్ధం కాలేదని తెలుస్తున్నది. యాప్ ప్రారంభ సమయంలో ఎదురైన సమస్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చాలా నిర్లక్ష్యంగా యాప్‌ను రూపొందించారనే విమర్శలున్నాయి. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, అటు ఐటీ అధికారుల వైఫల్యానికి, వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
రైతుల యూరియా కష్టాలు రెట్టింపు
శనివారం నుంచి రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదని, ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చంటూ సర్కారు ఊదరగొట్టింది. తీరా ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ముందుగా ఊహించిన విధంగానే యూరియా కోసం రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. రైతులు యూరియా బుకింగ్ కోసమని పీఏసీఎస్ కేంద్రాల వద్ద, ఎరువుల దుకాణాల వద్ద క్యూకట్టారు. కానీ యాప్ ఓపెన్ కాకపోవడంతో గంటల తరబడి ఎదురుచూశారు.
ఇటు యాప్‌లో యూరియా బుక్ కాకపోవడంతో అధికారులు యూరియా పంపిణీ చేయలేదు. ఇప్పటికే మ్యానువల్‌గా (ప్రస్తుత పద్ధతి) యూరియా పంపిణీని అధికారులు నిలిపేశారు. దీంతో అటు యాప్‌లో యూరియా ఇవ్వకుండా, ఇటు నేరుగా ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అయితే యాప్ పనిచేయదని నిర్ధారించుకున్న తర్వాత మ్యానువల్‌గా ఇచ్చేందుకు అనుమతిచ్చారు. దీంతో యాప్ కోసం క్యూకట్టిన రైతులు ఆ తర్వాత మళ్లీ మ్యానువల్ కోసం క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా రైతుల కష్టాలు రెట్టింపయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సర్కారు తీరుపై అన్నదాతల ఆగ్రహం
యూరియా యాప్ అట్టర్‌ఫ్లాప్ కావడంతో సర్కారు తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగం తమపైనే చేయాలా? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే పడుతున్న ఇబ్బందులు చాలవన్నట్టుగా మళ్లీ యాప్‌తో కొత్త ఇబ్బందులు పెట్టాలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూరియా కోసం వచ్చిన రైతులు యాప్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తిగా పనిచేయకుండానే ఎందుకు తీసుకొచ్చారంటూ అక్కడి అధికారులపై మండిపడ్డారు. దుకాణాల్లో అవసరమైన స్టాక్ ఉంటే.. క్యూలు ఎందుకు కట్టాల్సి వస్తుందని, ఈ యాప్‌లు ఎందుకు తేవాల్సి వస్తుంది? అని ప్రశ్నించారు.
తొలి రోజు నుంచే సాంకేతిక సమస్యలు
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ, మంత్రి చెప్పినట్టుగా శనివారం యాప్ ప్రారంభమే కాలేదు. యాప్‌లో ఉదయం నుంచే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఇలా లాగిన్ నుంచే సాంకేతిక సమస్యలు ఎదురుయ్యాయి. ఒక్క రైతుకు కూడా యూరియా బుకింగ్ కాలేదు. ఒక్క రైతుకు కూడా ఐడీ జనరేట్ కాలేదు.